బాలీవుడ్ నటి సారా అర్జున్ నటించిన తాజా చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ప్రభావంతో సారా మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. బుధవారం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ విడుదల చేసిన వీక్లీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. గత వారం రెండో స్థానంలో ఉన్న సారా.. ఈ వారం టాప్కు చేరడం విశేషం.
‘ధురంధర్’ సినిమాలో యాలినా పాత్రలో సారా అర్జున్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో అగ్ర హీరోలు దళపతి విజయ్, రెబల్ స్టార్ ప్రభాస్ సహా యువ హీరో అగస్త్య నందాలను సారా వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ రెండో స్థానంలో నిలిచారు. గత వారం మూడో స్థానంలో ఉన్న ఆయన ఈసారి ఒక స్థానం ఎగబాకారు. విజయ్ 8, అగస్త్య నందా 12, భాగ్యశ్రీ బోర్సే 15, సిబి చక్రవర్తి 16, యామి గౌతమ్ 17, ప్రభాస్ 19, శ్రీరామ్ రాఘవన్ 22, తారా సుతారియా 24, దిన్జిత్ అయ్యతన్ 27, నివిన్ 30, సిమార్ భాటియా 42వ స్థానాల్లో నిలిచారు.
Also Read: OPPO Reno 15 Launch: ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్.. నాలుగు కొత్త మోడళ్లు, ధరలు, ఫీచర్లు ఇవే!
ధురంధర్ హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. భారత్‌లో ఈ సినిమా నెట్ వసూళ్లు రూ.831 కోట్లకు పైనే అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 33వ రోజు (జనవరి 6) ఒక్క రోజులోనే రూ.5.70 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టడంతో మొత్తం వసూళ్లు రూ.831.40 కోట్లకు చేరాయి. దీంతో ఇప్పటివరకు నంబర్ వన్ స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ హిందీ వెర్షన్ రికార్డును ధురంధర్ అధిగమించింది. పుష్ప 2 హిందీలో రూ.830 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్, లోకేష్ ధర్లు జ్యోతి దేశ్‌పాండేతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. ధురంధర్ పార్ట్ 2 మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.