Tilak Varma Out From IND vs NZ T20 Series Due to Injury: భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు ఆటగాడు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. గాయం కారణంగా తిలక్ వర్మ పొట్టి సిరీస్‌లో పాల్గొనలేకపోతున్నాడు. భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం… ప్రస్తుతం తిలక్ వర్మ అబ్డొమన్ (పొత్తికడుపు) గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఇంకా సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. తిలక్ గాయపడడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అతని స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టెస్టులు, వన్డేల్లో భారత కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని సమాచారం. అందుకు కారణం అతడి ఫామ్. అస్సాం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అతడు భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే.. తిలక్ వర్మకు బదులుగా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి మేనేజ్‌మెంట్ ఎవరికి అవకాశం ఇస్తుందో.
తిలక్ వర్మ ప్రస్తుతం రాజ్‌కోట్‌లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్నాడు. బుధవారం ఉదయం అల్పాహారం చేసిన అనంతరం అతడికి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ టెస్టులు నిర్వహించి.. నివేదికలను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్యులకు పంపించారు. వైద్యులు తిలక్ వర్మకు శస్త్రచికిత్స అవసరం అని సూచించినట్లు తెలుస్తోంది. ఈ శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
ఇటీవల టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ భారత జట్టులో లేకపోవడం భారత్‌కు నష్టమేనని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో సిరీస్ ముందు ఈ గాయం టీమిండియాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అతడు త్వరగా కోలుకుని మళ్లీ జట్టులోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారత జట్టు ఆందోళన న్యూజిలాండ్ సిరీస్ కన్నా.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌పై ఉంది. కీలక టోర్నమెంట్‌కు తిలక్ అందుబాటులో ఉంటాడా? అన్నదే ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.