మన స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలను కమిట్ అయ్యే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా కమిట్ అయ్యాడట. ఇక తాజాగా సంజయ్ లీలా బన్సాలీతోనూ సినిమా చేయబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బన్సాలీ బాలీవుడ్ లో పేరున్న దర్శకుడే కాదు… నిర్మాత, రచయిత, సంగీత దర్శకుడుగా గుర్తింపు ఉన్నవాడు. ఇప్పటికే భారత ప్రభుత్వం అతనిని పద్మశ్రీతో సత్కరించింది. పలు బ్లాక్ బస్టర్ హిట్స్ తీసిన బన్సాలీ ప్రస్తుతం ఆలీయాభట్ తో ‘గంగూభాయ్ కథైవాడి’ సినిమా తీస్తున్నాడు. బన్సాలీతో ఎన్టీఆర్ సినిమా వార్త నిజం అయితే అది నందమూరి ఫ్యాన్స్ కి పండగే. ప్రస్తుతానికి గాసిప్స్ కి పరిమితమైన ఈ వార్త నిజం కావాలని కోరుకుందాం.