Samuthirakani: కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని గురించి ప్రత్యేకంగా తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో .. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ తో బ్రో అనే సినిమా చేసి మరింత దగ్గరయ్యాడు సముద్రఖని. ప్రస్తుత తమిళ్ లో పలు సినిమాలు చేస్తున్న సముద్రఖని మలయాళ సినిమాలకు సపోర్ట్ చేయను అని డైరెక్ట్ గా చెప్పడం కోలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ప్రేమలు ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయ్యి.. ఇక్కడ కూడా షేక్ చేసిన విషయం తెల్సిందే. ఇక దీంతో పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా మంజుమ్మెల్ బాయ్స్. కొడైకెనాల్‌కు వెళ్లి గుణ గుహను చూడాలని అనుకుని ఇబ్బందుల్లో పడే స్నేహితుల బృందం కథనే ఈ సినిమా. 2006లో నిజంగా జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని చిదంబరం ఎస్ పొదువాల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా రిలీజ్ చేయాలనీ కొంతమంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే సముద్రఖని ఈ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ” నేను ఖాళీగా ఉండలేక చిన్న సినిమాలు చేస్తూనే ఉండేవాడిని. అయితే ఈ రోజుల్లో ప్రేక్షకులకు చేరువ కావడం కష్టంగా మారింది. ఎంతో కష్టపడి, డబ్బు పెట్టి ఆనందంతో సినిమాలు చేస్తాం కానీ విడుదలయ్యాక ఆ ఫీలింగ్ ఉండదు. ఇలాంటి మంచి చిన్న తమిళ చిత్రాలను ఆదుకోవడానికి థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. నా సినిమా తీయమని వారిని వేడుకోవలసి వచ్చింది. మంజుమ్మెల్ బాయ్స్ వంటి మలయాళ చిత్రాలకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుండగా, మన చిన్న తమిళ చిత్రాలకు కూడా అంత మంచి ఆదరణ లభించలేదు. ఇప్పుడు, ప్రణవ్ మోహన్‌లాల్ చిత్రం ఇక్కడ విడుదలవుతోంది.. ఇప్పటికే థియేటర్లు బుక్ చేసేశారు. కానీ నా సినిమాలను విడుదల చేయమని వారిని అడుక్కుంటున్నాను.. ఈ సమస్య వల్ల చిన్న సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. వీటిని చూసాక.. నేను చిన్న సినిమాలు చేయను.. చేస్తే పెద్దవి చేస్తాను.. లేకపోతే అలానే కూర్చుంటాను. మంజుమ్మెల్ బాయ్స్ ను నేను సపోర్ట్ చేయను.. అసలు ఎందుకు చేయాలి.. ?. నవజాత శిశువును ఆదరించి ప్రోత్సహించాలి. బాగా ఎదిగిన పిల్లవాడు ఎలాగైనా బాగుంటాడు. ఇప్పటికే సక్సెస్ అయిన సినిమాను ప్రతి ఒక్కరికి చూపించడం వల్ల ప్రయోజనం ఏమిటి? లాభదాయకంగా ఉంటుందని యజమానులకు తెలుసు కాబట్టి థియేటర్లకు రీ-రిలీజ్‌లు ఇస్తున్నారు. మంజుమ్మెల్ బాయ్స్ తర్వాత గుణ సినిమా గురించి మాట్లాడుకుంటారు కాబట్టి.. దాన్ని రీ రిలీజ్ చేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.