Salman Khan Is A Sadist Says Somy Ali: తనకు వీలు చిక్కునప్పుడల్లా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసే అతని మాజీ ప్రేయసి సోమి అలీ.. తాజాగా మరోసారి అతనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఓ శాడిస్ట్ అని, అతనితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తనని దారుణంగా కొట్టాడని పేర్కొంది. సల్మాన్‌ని ఓ ఉమెన్ బీటర్ (మహిళల్ని కొట్టే వ్యక్తి)గా పేర్కొన్న ఆ పాకిస్తాన్ నటి.. తనతో పాటు ఇంకా చాలామంది అమ్మాయిలపై చెయ్యి చేసుకున్నాడని కుండబద్దలు కొట్టింది. అతడు ఎంతటి శాడిస్టో మీకు తెలియదని, అతడ్ని గొప్పగా కీర్తించడం మానేయండని అభిమానుల్ని సూచించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మైనే ప్యార్ కియా పోస్టర్ని షేర్ చేస్తూ.. పై విధంగా సోమి అలీ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది.
కాగా.. ఒకప్పుడు బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన సోమి అలీ, సల్మాన్ ఖాన్‌తో పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలింది. అప్పట్లో వీళ్లు పెళ్లి చేసుకుంటారన్న వార్తలూ తెగ చక్కర్లు కొట్టాయి. కానీ.. అందరికీ షాకిస్తూ ఈ జంట తమ పదేళ్ల ప్రేమాయణానికి చెక్ పెట్టేసింది. బ్రేకప్ చెప్పేసి.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. కొంతకాలం తర్వాత సోమి అలీ అమెరికా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈమె ‘నో మోర్ టియర్స్’ అనే సంస్థను నడిపిస్తోంది. ఇది నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇదిలావుండగా.. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ని సైతం సల్మాన్ ఖాన్ ఓ పార్టీలో కొట్టినట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! ఆ సంఘటన తర్వాత సల్మాన్‌తో ఐశ్వర్య రిలేషన్ కట్ చేసుకుందని వార్తలు ఉన్నాయి.