తనకు తెలిసిన వారు ఆపదలో ఉంటే ఆపన్న హస్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ కండలవీరుడుగా పేరొందిన సల్మాన్ ఖాన్ బండల్లాంటి కండల వెనుక వెన్నపూసలాంటి మనసు ఉందని సన్నిహితులు చెబుతారు. బండబారిన హృదయమూ ఉందని, అందుకే ఒకప్పుడు తప్పతాగి కారు నడుపుతూ కొందరి ప్రాణాలూ హరించాడని గుర్తు చేస్తారు ఇంకొందరు. ఇక వన్యప్రాణులను వేటాడి కటకటాలూ లెక్కపెట్టిన సంగతినీ జ్ఞప్తికి తెస్తారు మరికొందరు. ఏది ఎలా ఉన్నా సల్మాన్ ఖాన్ కుటుంబం అసలు సిసలు భారతీయతకు నిదర్శనం అంటారు ఆయన మిత్రులు. ఎందుకంటే సల్మాన్ ఇంట్లో అన్ని మతాల పర్వదినాలనూ ఘనంగా నిర్వహిస్తారు.
భారతదేశంలో తరిగిపోని చెరిగిపోని రికార్డులు సొంతం చేసుకున్న ‘షోలే’ చిత్ర రచయితలు సలీమ్-జావేద్ ద్వయంలో సలీమ్ ఖాన్ పెద్దకొడుకు సల్మాన్. 1965 డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ జన్మించాడు. భారతదేశంలో ఎందరో పేరున్న రచయితల తనయులు తెరపైన వెలిగారు. అయితే సలీమ్ తనయుడు సల్మాన్ ఖాన్ స్థాయిలో వెండితెరపై వెలిగిపోయిన వారు లేరనే చెప్పాలి. బాల్యంలో తండ్రి సక్రమంగా ఇంటిపట్టున లేకపోవడంతో పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు తానే నిర్వర్తించేవాడు. ఎలాగైనా సినిమాల్లో నటించాలనే తపనతో కొన్ని సినిమాల్లో అలా వచ్చి, ఇలా పోయే పాత్రల్లో కనిపించాడు. ‘బీవీ హోతో ఐసీ’ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించాడు. ఆ సమయంలోనే అతని శరీరసౌష్టవం చూసిన రాజశ్రీ సంస్థ అధినేతలు తాము నిర్మించబోయే ‘మైనే ప్యార్ కియా’లో ప్రేమ్ పాత్రకు సల్మాన్ ను ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలచింది.
తెలుగులోనూ ‘ప్రేమపావురాలు’ పేరుతో అనువాదమై అద్భుత విజయం సాధించింది. ఆ తరువాత సల్మాన్ బాలీవుడ్ యంగ్ హీరోస్ లో స్టార్ గా నిలిచాడు. హీరోగా నటించిన రెండో సినిమా ‘బాఘీ’తోనే కథకుడుగా మారాడు సల్మాన్. అయితే అది పరాజయం పాలయింది. ‘సాజన్’లో సంజయ్ దత్ తో కలసి నటించీ మెప్పించాడు. రాజశ్రీ సంస్థ నిర్మించిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’లో మరోమారు ప్రేమ్ గా కనిపించాడు. మాధురీ దీక్షిత్ తో సల్మాన్ జోడీ కట్టిన ఆ సినిమా కనకవర్షం కురిపించింది. ఈ సినిమా కూడా తెలుగులో ‘ప్రేమాలయం’గా అనువాదమై మరోమారు అనూహ్య విజయాన్ని సల్మాన్ కు అందించింది. దాంతో సల్మాన్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోకి అనువాదమయ్యాయి. ఆ పై స్టార్ హీరోగా జేజేలు అందుకుంటూ సాగిన సల్మాన్ పరాజయాల పర్వంలో పయనిస్తూ ఉండగా, సౌత్ రీమేక్స్ అతణ్ని కాపాడాయి. మళ్ళీ తన స్టార్ హోదాను నిలుపుకోవడానికి దక్షిణాది చిత్రాల కథలే సల్మాన్ కు ఊపిరి పోశాయి.
రీల్ లైఫ్ లో తిరుగులేని మాస్ హీరోగా సాగుతున్న సల్మాన్ ఖాన్ రియల్ లైఫ్ లో పలు ప్రేమాయణాలు సాగించాడు. ఇప్పటికీ అవివాహితుడిగానే ఉన్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ వరుస విజయాల బాటలోనే పయనించాడు. ప్రతియేటా ఈద్ కానుకగా సినిమాలను విడుదల చేసే సల్మాన్ ఈ సారి కరోనా కారణంగా తన ‘రాధే’ చిత్రాన్ని జీ 5 ఓటీటీలో విడుదల చేశాడు. అయితే మునుపటిలా ఆకట్టుకోలేక పోయాడు. తరువాత నవంబర్ లో వచ్చిన సల్మాన్ ‘అంతిమ్’ కూడా మురిపించలేకపోయింది. రాబోయే సల్మాన్ మూవీస్ పైనే అభిమానులు ఆశలు పెంచుకున్నారు. “లాల్ సింగ్ ఛద్దా, పఠాన్” చిత్రాల్లో కేమియో అప్పియరెన్స్ ఇస్తున్నాడు సల్మాన్. “టైగర్ 3, అంఖ్ మిచోలీ” సినిమాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. “ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై” చిత్రాల్లో ‘టైగర్’గా అలరించిన సల్మాన్ ఇప్పుడు ‘టైగర్ 3’లో నటిస్తున్నాడు. ఫ్యాన్స్ ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలతో సల్మాన్ ఏ తీరున జనాన్ని మురిపిస్తాడో చూడాలి.