బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు ఇటీవల సోషల్ మీడియా కోడై కూసింది. ఇదే విషయాన్ని ఇటీవల తన సినిమా ‘అంతిమ్’ ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కన్ ఫామ్ చేశాడు సల్మాన్. దీని ప్రకారం మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ గా చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ల ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు సల్మాన్. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర ఇది. తెలుగు ప్రేక్షకులకు మరో ముఖ్యమైన సమాచారం కూడా అందించాడు సల్మాన్. చిరంజీవి సినిమాలోనే కాదు వెంకటేశ్ సినిమాలోనూ నటించబోతున్నట్లు తెలియచేశాడు సల్మాన్.
చిరంజీవి సినిమా ఆఫర్ రాగానే నిడివితో సంబంధం లేకుండా అంగీకరించానని, త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నానని చెప్పాడు సల్లూ భాయ్. దీనికోసం యూనిట్ అడిగినన్ని కాల్షీట్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని, వెంకటేష్ సినిమా వివరాలను త్వరలో తెలియజేస్తానని అంటున్నాడు. సల్మాన్ నటించిన ‘అంతిమ్’ సినిమాని మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మించాడు. ఆయుశ్ శర్మ, మహిమా మక్వానా ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమా నవంబర్ 26న విడుదలయింది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇకపై తన సినిమాలు తెలుగుతో పాటు ఇతర దక్షిణ భారత భాషల్లో కూడా విడుదల చేస్తానంటున్నాడు సల్మాన్. ప్రస్తుతం భాయిజాన్, దబాంగ్4, టైగర్ 3లో నటిస్తున్నాడు సల్మాన్ ఖాన్. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’లో కూడా అతిధి పాత్రలో కనిపించనున్నాడు భజరంగీ భాయీజాన్.