Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చావు బతుకుల మధ్య పోరాడి బయటకు వచ్చాడు. ఇక విరూపాక్ష సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం గాంజా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాలు పక్కన పెడితే.. సామజిక సేవ అంటే తేజ్ ఎప్పుడు ముందే ఉంటాడు. మొదటినుంచి కూడా మెగా ఫ్యామిలీ సామజిక సేవలో ముందు ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. ఎక్కువగా ఇలాంటి కార్యకలాపాలను చేస్తూ ఉంటాడు. అయితే ఒకప్పుడు అవేమి బయటికి రాలేదు. ఇప్పుడు రాజకీయాల్లో పవన్ ప్రజల సమస్యలే లక్ష్యంగా పోరాడుతున్నాడు.
ఇక మెగా కుటుంబంలో పవన్ ను చిన్నప్పటి నుంచి అనుకరించేది తేజ్ మాత్రమే. ఆయనలా సింపుల్ గా ఉంటూ.. నిత్యం అభిమానులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక తన అభిమానులకు ఎటువంటి సాయం కావాలన్నా ముందు ఉంటాడు. బైక్ యాక్సిడెంట్ తరువాత తేజ్ లో ఎంతో మార్పు వచ్చింది. జీవితం ఏంటో తెలిసివచ్చిందని తేజ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి ప్రమాదాల గురించి, హెల్మెట్ ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన తెచ్చే ప్రోగ్రాం ఏది ఉన్నా అటెండ్ అవుతాడు. తాజాగా.. హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమానికి తేజ్ గెస్ట్ గా విచ్చేశాడు. రోడ్డు ప్రమాదాలు, మితిమీరిన వేగం, హెల్మెట్ ఉపయోగాలు.. ఇలా వీటి గురించి తేజ్ మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.