సుప్రీమ్ హీరో సాయితేజ్ ఇటీవల జరిగిన రోడ్ యాక్సిడెంట్ నుండి నిదానంగా కోలుకుంటున్నాడు. దాంతో అతని తాజా చిత్రం ‘రిపబ్లిక్’ మూవీ విడుదలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ మూవీని అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు సినిమా సెన్సార్ ను కంప్లీట్ చేశారు. తమ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించిందని, ముందు అనుకున్న విధంగానే గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1న మూవీని విడుదల చేస్తామని అన్నారు.
జీ స్టూడియోస్ సమర్పణలో జె. బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు దేవ్ కట్టా దర్శకత్వం వహించారు. పొలిటికల్ సిస్టమ్ ను ఢీ కొట్టే ఐ.ఎ.ఎస్. అధికారి పంజా అభిరామ్ గా ఇందులో సాయి తేజ్ నటించాడు. ఐశ్వర్యా రాజేశ్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, కాలేజ్ సాంగ్‌తో పాటు జోర్ సే.. సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, సాయితేజ్ యాక్టింగ్, దేవ్ కట్టా మార్క్ టేకింగ్, డైలాగ్స్ ఆడియెన్స్ ను అలరిస్తాయని నిర్మాతలు తెలిపారు. మరి హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత సాయితేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో ఏ మేరకు పాల్గొంటాడో చూడాలి.