చాలామంది కథానాయికలు ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడరు. ఏదో వచ్చామా, గ్లామర్‌గా కనిపించామా, నాలుగు పాటల్లో డ్యాన్స్ చేశామా, వెళ్ళామా అన్నట్టుగా లాగించేస్తుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తాము చేసే ప్రతీ పాత్ర ఛాలెంజింగ్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం, ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. నేచురల్ నటిగా తనదైన ముద్ర వేసిన ఈమె.. ఇప్పటిదాకా నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ పాత్రల్లోనే నటించింది. ఇప్పుడు పని పట్ల తనకు ఎంత అంకితభావం ఉందో మరోసారి చాటి చెప్పింది. పాత్ర కోసం ఏకంగా ఒక రోజంతా ఆహారం తీసుకోకుండా ఉంది. ఈ విషయం స్వయంగా దర్శకుడు వేణు ఊడుగుల చెప్పాడు.
ఎన్నో వాయిదాల అనంతరం జులై 1వ తేదీన ‘విరాటపర్వం’ విడుదలవుతున్న నేపథ్యంలో.. వేణు ఊడుగుల ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు సాయి పల్లవి డేడికేషన్ గురించి చెప్పుకొచ్చాడు. లుక్స్, నటన పరంగా సాయి పల్లవి పాత్రలో ఒదిగిపోయిందని.. ఆమె ఓ అసాధారణ నటి అంటూ కొనియాడాడు. అంకిత భావంత పని చేస్తుందని.. పాత్రకు తగ్గ అవతారంలోకి మారేందుకు ఒక రోజంతా ఆహారం తీసుకోలేదని వెల్లడించాడు. ఈ చిత్రంలో ఆమె వెన్నెల అనే క్యారెక్టర్‌లో కనిపిస్తుందని, సినిమాలోనే సాయి పల్లవి రోల్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా 90ల నాటి కథతో తెరకెక్కిందని.. గాఢమైన ప్రేమ, రాజకీయ నేపథ్యంలో సాగుతుందన్నాడు. మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతే ఎలా బాధపడతామో, ఈ సినిమా చూస్తున్నప్పుడు అదే భావోద్వేగానికి ప్రేక్షకులు లోనవుతారని అన్నాడు.
ఇక ఈ సినిమాలో కథానాయకుడు పాత్ర కోసం తాను ముందుగా కలిసింది రానానే అని, మరే హీరోకి ఈ స్క్రిప్ట్ వినిపించడలేదని వేణు తెలిపాడు. సామాజిక స్పృహ, వాస్తవికతను తెరపైకి తీసుకురావాలనే ఆకాంక్ష, తదితర లక్షణాలున్న హీరో నటుడు రానా అని.. ఆయన మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలడన్న నమ్మకం ముందు నుంచే ఉందని అన్నాడు. అయితే, తాను అనుకున్న దానికంటే రానా మంచి ఔట్‌పుట్ ఇచ్చాడని, అందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని వేణు ఊడుగుల చెప్పుకొచ్చాడు.