Anthima Teerpu: సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెగా ‘కబాలి’లో నటించి మెప్పించింది సాయి ధన్సిక. దానికి ముందు తర్వాత కూడా ఆమె పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. అలానే ‘కబాలి’ తర్వాత సాయి ధన్సిక తెలుగులోనూ రెండు మూడు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒకటైన ‘షికారు’ గత యేడాది విడుదలై యువతరం ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి ధన్సికతో ఎ. అభిరాం దర్శకత్వంలో డి. రాజేశ్వరరావు ‘అంతిమ తీర్పు’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగిన జరిగిన మీడియా సమావేశంలో అమిత్ తివారి మాట్లాడుతూ, ”ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు ఆయనలో ఒక ప్యాషన్ చూశాను. ఒక మంచి సినిమా తియ్యాలి అని తపన ఆయనలో నాకు కనిపించింది. డి. రాజేశ్వరరావు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. షూటింగ్ మంచి హెల్తీగా జరిగింది” అని చెప్పారు. నాయిక సాయి ధన్సిక మాట్లాడుతూ, ”ఓ కాజ్ కోసం తీసిన ఈ సినిమాకు మొదటి నుండి సపోర్ట్ ఇచ్చింది మీడియా వాళ్ళే. అందుకే వాళ్ళకు ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇందులో అందరం మంచి మంచి పాత్రలు పోషించాం. ఓ మంచి కథతో వస్తున్న మమ్మల్ని ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

దర్శకుడు అభిరాం మాట్లాడుతూ, “గతంలో ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలకు పనిచేసాను. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. సాయి ధన్సిక అద్భుతంగా తన పాత్రను పోషించింది. అమిత్ తివారి, నాగమహేష్ కూడా చక్కని పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. నిర్మాత సహకారంతో అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయగలిగాం. అతి త్వరలోనే విడుదల తేదీని తెలియచేస్తాం” అని అన్నారు.