కరోనా సెకండ్ వేవ్ ఈ యేడాది తెలుగు సినిమా రంగాన్ని కాస్తంత కల్లోల పర్చింది. అయితే దానికంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరైన సహకారం లభించకపోవడం సినిమా రంగాన్ని ఇబ్బందులకు గురిచేసింది. తెలంగాణలో మరోసారి సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసు విషయమై విచారణను ఎదుర్కొంటే, ఏపీలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ప్రభుత్వ విధానాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మొత్తం మీద ఈ యేడాది సినిమా రంగ ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు.
గత యేడాది జరగాల్సిన 51వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ) కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ యేడాది జనవరి 16 నుండి 24 వరకూ గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఇది జరిగింది. అలానే ఈ యేడాది నవంబర్ 20 నుండి 28 వరకూ 52వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం అదే వేదికపై ఘనంగా జరిగింది.
కేంద్రప్రభుత్వం జనవరి 25వ తేదీ గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అలానే ప్రముఖ గాయని చిత్రకూ పద్మ భూషణ్‌ను ప్రకటించింది. మరో గాయని బోంబే జయశ్రీ, మలయాళీ గీత రచయిత, సంగీత దర్శకుడు దామోదరన్ నంబూద్రి, దివంగత నటుడు నరేశ్ భాయ్, గాయకుడు మహేశ్ భాయ్ లకు పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రకటించింది. బాలుకు ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయన కుమారుడు చరణ్ నవంబర్ 9న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.

కరోనా కారణంగా మూతపడిన థియేటర్లను నూరుశాతం ఆక్యుపెన్సీతో నిర్వహించవచ్చని కేంద్ర ప్రభుత్వం జనవరి 27న ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది.

ఫిబ్రవరి 2వ తేదీ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబై గోరేగావ్ లోని రెట్రో గ్రౌండ్స్ లో మొదలైంది. అదే రోజు సాయంత్రం సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్స్ పనిచేయగా, పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో సెట్ లో ప్రభాస్, సైఫ్ అలీఖాన్ లేరు. కొద్ది మంది సిబ్బంది మాత్రం గాయాలపాలయ్యారు.

సినీనటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముంబైలో ఫిబ్రవరి 15వ తేదీ అరెస్ట్ చేశారు. జేఎం జోషి గ్రూప్, ఓంకార్ రియల్టర్స్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ అరెస్ట్ జరిగింది. 18 గంటల విచారణ అనంతరం సచిన్ ను మూడు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది.
ఆన్ లైన్ ద్వారా లొకేషన్స్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2020 డిసెంబర్ 18న ఓ జీవోను విడుదల చేసింది. అది ఫిబ్రవరి 20న నిర్మాతల మండలి దృష్టికి రావడంతో వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రదేశాల షూటింగ్ ఛార్జీలు పెంచడంపై వారు మండిపడ్డారు. ఏపీలో షూటింగ్ లొకేషన్స్ ను ఉచితంగా ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం వాటి ఛార్జీలు పెంచిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

మార్చి3వ తేదీ బాలీవుడ్ లోని సినీ ప్రముఖుల నివాసాలలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. తాప్సీ, అనురాగ్ కశ్యప్, వికాశ్ బెహెల్, విక్రమాదిత్య మౌత్వానె, మధు మంతెన అందులో ఉన్నారు. వీరిలో కొందరిపై ఢిల్లీలోని రైతుల నిరసనకు మద్దత్తు తెలిపినందునే ఈ సోదాలు జరిగాయని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

‘వి’ సినిమాలో తన అనుమతి లేకుండా ఫోటోను వాడుకోవడంపై నటి, మోడల్ సాక్షి మాలిక్ ముంబై హైకోర్టుకు ఎక్కింది. మార్చి 3న దీనిపై తీర్పును ఇస్తూ ఆ సినిమాలో కమర్షియల్ సెక్స్ వర్కర్ గా సాక్షిని పేర్కొనడం దారుణమని కోర్టు అభిప్రాయపడింది. వెంటనే ఈ ఫోటోను సినిమా నుండి తొలగించాలనే ఆదేశాలు జారీ చేసింది.

ప్రముఖ కథానాయిక మెహ్రీన్ ఫిర్జాదీ వివాహ నిశ్చితార్థం హర్యానా రాజకీయ నేత వారసుడైన భవ్య బిష్ణోయ్‌తో మార్చి 12న జైపూర్ లో జరిగింది. అయితే కారణాలు ఏవైనా వారి నిశ్చితార్థం రద్దు అయ్యింది. ఈ విషయాన్ని జూలై 3న స్వయంగా మెహ్రీన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మార్చి 22న కేంద్ర ప్రభుత్వం జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటులుగా ధనుష్, మనోజ్ బాజ్ పాయి, నటిగా కంగనా రనౌత్ ఎంపికయ్యారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు ‘మహర్షి’ ఎంపిక కావడం విశేషం. అలానే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని ‘జెర్సీ’ ఎంపికైంది. కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం, బెస్ట్ ఎడిటర్ గా నవీన్ నూలి (జెర్సీ) ఎంపికయ్యారు. వీరందరూ అక్టోబర్ 25న జరిగిన ప్రదానోత్సవ సభలో పాల్గొని అవార్డులను అందుకున్నారు.

ఏప్రిల్ 1వ తేదీ కేంద్ర ప్రభుత్వం సూపర్ స్టార్ రజనీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఆశాభోంస్లే, మోహన్ లాల్, బిశ్వజిత్ చటర్జీ, శంకర్ మహదేవన్, సుభాష్ ఘాయ్ తో కూడిన జ్యూరీ రజనీకాంత్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అక్టోబర్ 25న రజనీకాంత్ ఈ పురస్కారం స్వీకరించారు.

కరోనా కారణంగా 2020లో కుదేలైన సినిమా రంగాన్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 6న చర్యలు తీసుకుంది. 2020 ఏప్రిల్, మే, జూన్ మాసాలలో విద్యుత్ బిల్లులను రద్దు చేసింది. ఆ తర్వాత ఆరు నెలలల విద్యుత్ స్థిర ఛార్జీలను వాయిదాలపై కట్టుకునే వెసులు బాటు కల్పించింది. బ్యాంకుల నుండి సినిమా థియేటర్లు తీసుకున్న రుణంలో యాభై శాతం వడ్డీ రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 7న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణా సంఘం సభ్యత్వ పదవికి చిరంజీవి రాజీనామా చేశారు.

ప్రముఖ నటుడు శరత్ కుమార్, నటి రాధిక దంపతులకు చెక్ బౌన్స్ కేసులో చెన్నయ్ స్పెషల్ కోర్టు ఏప్రిల్ 7వ తేదీ ఏడాది జైలు శిక్ష, ఐదు కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కోర్టు నుండి శరత్ కుమార్ అనుమతి పొందారు.

సినిమా టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 8వ తేదీ జీవో 35ను విడుదల చేసింది. దీంతో 9వ తేదీ విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కలెక్షన్లపై ప్రభావం పడుతుందని ఎగ్జిబిటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 26న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కరోనా కారణంగా ఈ వేడుకను రెండు చోట్ల నిర్వహించారు. ‘నోమడ్ ల్యాండ్’ ఉత్తమ చిత్రంగా, ఆంథోని హాప్కిన్స్ (ది ఫాదర్) ఉత్తమ నటుడిగా, ఫ్రాన్సెస్ మెక్ డోర్మెండ్ (నోమడ్ ల్యాండ్) ఉత్తమ నటిగా, ఛోల్ ఝావో (నోమడ్ ల్యాండ్) ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.

మే 9వ తేదీ తెలుగు ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్, కోశాధికారిగా రాజేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పిఎస్ఎన్ దొర ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లను ఎగ్జిబిటర్స్ స్వచ్ఛందంగా మూసివేశారు. అయితే సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నూరుశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకోవచ్చునని తెలంగాణ ప్రభుత్వం జూన్ 20న తెలిపింది. కానీ ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతూ ఉండటంతో అక్కడ థియేటర్లు తెరవలేదు. దాంతో తెలంగాణలోనూ థియేటర్లను తెరవడానికి ఎగ్జిబిటర్స్ ఆసక్తి చూపలేదు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆమీర్‌ఖాన్ తన భార్య, నిర్మాత, దర్శకురాలు కిరణ్ రావ్ కు విడాకులు ఇస్తున్నట్టు జూలై 3న ప్రకటించాడు. గతంతో మొదటి భార్య రీనాదత్తాకు విడాకులు ఇచ్చిన మూడేళ్ళ తర్వాత ఆమీర్ కిరణ్ ను పెళ్ళాడాడు. వీరికి ఆజాద్ అనే కొడుకు ఉన్నాడు.

సినిమా థియేటర్లను యాభై శాతం ఆక్యుపెన్సీతో తెరచుకోవచ్చునని ఏపీ ప్రభుత్వం జూలై 5న ప్రకటించింది. అయితే రాత్రి కర్ఫ్యూ కారణంగా సెకండ్ షోను ప్రదర్శించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఇదే సమయంలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి ఇవ్వమని, కరెంట్ ఛార్జీలు తగ్గించమని కోరుతూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ సి.ఎస్. సోమేష్ కుమార్ కు వినతిపత్రం అందించారు.
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జూలై 7న సర్వసభ్య సమావేశం నిర్వహించి, నిర్మాతలు ఎవ్వరూ అక్టోబర్ వరకూ తమ సినిమాల ప్రదర్శనను ఓటీటీకి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది.
తమిళ స్టార్ హీరో విజయ్ కు మద్రాస్ హైకోర్టు జూలై 13న షాక్ ఇచ్చింది. 2012లో రూ. 8 కోట్లతో కొన్న రోల్స్ రాయిస్ కారుకు రూ. 1.6 కోట్ల రూపాయల దిగుమతి సుంకం కట్టాలని తీర్పు చెప్పింది. అలానే అది తానే కొన్నాననే విషయాన్ని దాచిపెట్టినందుకు అదనంగా లక్ష రూపాయల జరిమానా విధించి, దానిని ముఖ్యమంత్రి కరోనా సహాయ నిధికి ఇవ్వమని తెలిపింది.

నీలిచిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, నిర్మాత రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు జూలై 19న అరెస్ట్ చేశారు. బ్లూ ఫిల్మ్స్ తీసి యాప్ లలో విడుదల చేస్తున్నారంటూ ఆయనపై ఈ యేడాది ఫిబ్రవరిలోనే కేసు నమోదైంది.

జూలై 20న తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ను వసూలు చేసుకోవచ్చునంటూ ప్రభుత్వం తెలిపింది.
రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు 23 వరకూ పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే పలు తెలుగు, హిందీ చిత్రాలలో నటించిన గెహనా వశిష్ట్ ను అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేశారు. హిందీ నటుడు ఉమేష్ కామత్ సైతం ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు.
ఆగస్ట్ 10వ తేదీ నటుడు ప్రకాశ్ రాజ్ చేతికి గాయమైంది. ధనుష్ మూవీ షూటింగ్ లో జారిపడటంతో వేలికి ఫ్యాక్చర్ అయ్యింది. డా. గురువారెడ్డి దగ్గర ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు.

ఆగస్ట్ 15వ తేదీ చిత్రపురి హౌసింగ్ కాలనీలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తమ్మారెడ్డి భరద్వాజ, సి. కళ్యాణ్ తో పాటు చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రస్తుత కార్యవర్గం ఈ కార్యక్రమంలో పాల్గొంది.
నాలుగు సంవత్సరాల నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టేకప్ చేసింది. సెప్టెంబర్ 1 నుండి విచారణకు హాజరు కావాలంటూ సినీ ప్రముఖులకు ఆగస్ట్ 25న నోటీసులు జారీ చేసింది.

ఆగస్ట్ 28న జరిగిన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ సర్వ సభ్య సమావేశంలో అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, కోశాధికారిగా విజయేందర్ రెడ్డి ఎంపికయ్యారు.
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కొహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి.) అధికారులు ఆగస్ట్ 28న అరెస్ట్ చేశారు.

న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆగస్ట్ 30న బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండేజ్ ను అధికారులు దాదాపు ఐదుగంటల పాటు విచారించారు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను విచారించినట్టు అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 1 నుండి వరుసగా పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తనీశ్, తరుణ్ హాజరయ్యారు.
సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించడానికి చర్యలు తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం ఓ జీవోను సెప్టెంబర్ 8న జారీ చేసింది.

సెప్టెంబర్ 10న యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు.
సెప్టెంబర్ 18న దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ కు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. 2017 ఆగస్ట్ లో వీరి నుండి సేకరించిన రక్తం, వెంట్రుకలు, గోళ్ళ నమూనాలను పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ అందులో డ్రగ్స్ ఆనవాళ్ళు లేవని గత యేడాది డిసెంబర్ 8న రిపోర్ట్ ఇచ్చినట్టు, రంగారెడ్డి జిల్లా కోర్టులో దాఖలైన చార్జిషీట్ లో తెలిపారు.
సైమా అవార్డులు 2019, 2020కు సంబంధించిన ప్రదానోత్సవం సెప్టెంబర్ 18, 19 తేదీలలో హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

సోనూసూద్ దాదాపు రూ. 20 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఆరోపించింది. విరాళల సేకరణలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ను ఆయన, ఆయన సహచరులు ఉల్లంఘించారని ఆరోపించింది.

2017 లో 12 మంది సినీ ప్రముఖులను డ్రగ్ కేసులో విచారించిన ఎక్సైజ్ శాఖ వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. కెల్విన్ కేసును తప్పుదోవ పట్టించడానికే సినీతారల పేర్లు ఉపయోగించినట్టు సెప్టెంబర్ 20న తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న ఆన్ లైన్ టికెటింగ్ విధానం గురించి రాష్ట్ర మంత్రి పేర్ని నానితోనూ, ఏపీఎఫ్ డీసి ఛైర్మన్ విజయ్ చందర్ తోనూ సినీ నిర్మాతలు సెప్టెంబర్ 20న సమావేశమయ్యారు.
సెప్టెంబర్ 25న ప్రముఖ నటుడు, జనసేన అధినేత ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాలలో దుమారం రేపాయి.

పవన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మంత్రి పేర్ని నానిని మచిలీపట్నంలో సినిమా నిర్మాతలు సెప్టెంబర్ 29న కలిశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంతో వ్యవహరించాలని కోరారు.
ప్రముఖ హాస్యనటుడు, స్వర్గీయ అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా రాజమండ్రిలోని హోమియో కళాశాల లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అక్టోబర్ 1న చిరంజీవి ఆవిష్కరించారు.

నాగచైతన్య – సమంత నాలుగేళ్ళ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. పరస్పర అంగీకారంతో ఇద్దరం విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా వారిద్దరూ అక్టోబర్ 2న ప్రకటించారు.

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని నౌకలో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో విచారణ కోసం ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్నారు.

అక్టోబర్ 10న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు తెలిచాడు. శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, రఘుబాబు జనరల్ సెక్రటరీగా, శివబాలాజీ ట్రెజరర్ గా గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపాడు.

అక్టోబర్ 11న ప్రకాశ్ రాజ్ సైతం ‘మా’సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపాడు.

అక్టోబర్ 12న ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలుపొందిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్ పెట్టబోతున్నట్టు వచ్చిన వార్తలను ప్రకాశ్ రాజ్ ఖండించాడు.
అక్టోబర్ 16న ‘మా’ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.
అక్టోబర్ 17వ తేదీ చిరంజీవి కుడిచేయి మణికట్టుకు శస్త్ర చికిత్స జరిగింది.
అక్టోబర్ 23న 2022 ఆస్కార్ పురస్కారాల కోసం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరికి ఇండియా నుండి తమిళ చిత్రం ‘కూళంగల్’ను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నయనతారతో కలిసి విఘ్నేష్ శివన్ నిర్మించాడు.
అక్టోబర్ 26న నటి సమంతకు కోర్టులో ఊరట లభించింది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి వీడియోలను టెలికాస్ట్ చేయవద్దని కోర్టు యూట్యూబ్ ఛానెల్స్ కు తెలిపింది. ఇదే సమయంలో సమంత సైతం తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని సూచించింది.

అక్టోబర్ 28న సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నయ్ లోని కావేరీ హాస్పిటల్ లో అనారోగ్యంతో చేరారు. 29వ తేదీ ఆయనకు మెడ నుండి మెదడుకు రక్త ప్రసారం చేసే నరాల్లో ఏర్పడిన అడ్డును తొలగిస్తూ, కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేశామని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

అక్టోబర్ 31న రజనీకాంత్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దానికి ముందు సి.ఎం. స్టాలిన్ ఆయనను పరామర్శించారు.
డిసెంబర్ 6న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ అధికారిణిగా షిఫాలీ కుమార్ బాధ్యతలు చేపట్టింది.
ఈ యేడాది ఏప్రిల్ 8న టిక్కెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను డిసెంబర్ 14న హైకోర్టు కొట్టివేసింది.
డిసెంబర్ 15న ఏపీ రవాణా, సమాచార ప్రసారశాఖా మంత్రి పేర్ని నానికి జగన్ ప్రభుత్వం అదనంగా సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించింది.

సిబిఎఫ్‌సి సీఈఓ రవీందర్ భాకర్ డిసెంబర్ 15వ తేదీన ఎన్.ఎఫ్.డి.సి. ఎండీగా, ఫిల్మ్ డివిజన్ డైరెక్టర్ జనరల్ గా, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా సీఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
డిసెంబర్ 16న బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టంకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పలు సవరణలు చేసింది. సినిమాలలో నటించే బాల బాలికలకు నిర్మాత, ఈవెంట్ మేనేజర్ జిల్లా కలెక్టర్ నుండి ముందస్తు అనుమతి పొందాలనే నిబంధన విధించింది.
బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేలో సన్నీ విజేతగా నిలుగా, రన్నరప్ స్థానాన్ని షణ్ముఖ్ జస్వంత్ దక్కించుకున్నాడు. మూడో స్థానంలో శ్రీరామ్ చంద్ర, నాలుగో స్థానంలో మానస్, ఐదో స్థానంలో సిరి హన్మంతు నిలిచారు.
కాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందిని డిసెంబర్ 20న తెలిపింది. తల్లి నుండి వారసత్వ లక్షణంగా కాన్సర్ తనకు సోకిందని సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఏపీలో సినిమా థియేటర్ల నిర్వహణలో పలు లోపాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాంతో డిసెంబర్ 22 నుండి వివిధ జిల్లాలోని అధికారులు థియేటర్లను తనిఖీ చేసి నిబంధనలు పాటించని వారికి నోటీసుల ఇవ్వడం లేదా వాటిని మూసివేయడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అతి తక్కువ ధరకు సినిమాలను ప్రదర్శించాలని చెప్పడంతో నిరసనగా కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసేశారు.