(డిసెంబర్ 14న రాజ్ కపూర్ జయంతి)
‘ఇండియన్ షో మేన్’గా పేరొందిన రాజ్ కపూర్ తనదైన నటనతోనూ ఆకట్టుకున్నారు. చార్లీ చాప్లిన్ ను అనుకరిస్తూ రాజ్ కపూర్ ‘చాప్లిన్ ఆప్ ది ఇండియా’గానూ పేరొందారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా, కథకునిగా రాజ్ కపూర్ తన బహుముఖ ప్రజ్ఞతో హిందీ చిత్రసీమను అలరించారు. రొమాంటిక్ మూవీస్ లో నటించడమే కాదు, సదరు చిత్రాలను దర్శకునిగా తెరకెక్కించడంలోనూ తనదైన బాణీ పలికించారు రాజ్ కపూర్. ఆయన బాణీని అనుసరిస్తూ నాయికలను అందంగా చూపించి ఆకట్టుకోవడంలో ఎందరో దర్శకులు కృతకృత్యులయ్యారు.
రాజ్ కపూర్ 1924 డిసెంబర్ 14న జన్మించారు. మొదట్లో ఆయన పేరు శిరీష్ నాథ్ కపూర్, తరువాత రణబీర్ రాజ్ కపూర్ అయ్యారు. ఆ తరువాత చిత్రసీమలో రాజ్ కపూర్ గానే వెలుగొందారు. ఆయన తండ్రి పృథ్వీరాజ్ కపూర్ మూకీల మొదలు టాకీల ఆరంభం దాకా అపురూప పాత్రల్లో నటించి మెప్పించిన మహానటుడు. పృథ్వీరాజ్ పెద్ద కుమారుడిగా జన్మించిన రాజ్ కపూర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయన తమ్ముళ్ళు షమ్మీకపూర్, శశికపూర్ సైతం నటనలో రాణించారు. పృథ్వీ రాజ్ తనయుల్లో రాజ్ కపూర్ స్థాయిని ఎవరూ అందుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. రాజ్ 11 ఏళ్ళ ప్రాయంలోనే ‘ఇంక్విలాబ్’ అనే చిత్రంలో నటించారు. దేవికారాణి నాయికగా రూపొందిన ‘హమారీ బాత్’లోనూ ఆయన కనిపించారు. 1947లో కిదార్ శర్మ తెరకెక్కించిన ‘నీల్ కమల్’లో తొలిసారి రాజ్ హీరోగా నటించారు. అందులో మధుబాల నాయిక. ఈ సినిమా రాజ్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.
రాజ్ కపూర్ ఓ వైపు నటిస్తూనే 1948లో దర్శకత్వం వహించాలని తపించారు. తత్ఫలితంగా తెరకెక్కిన చిత్రమే ‘ఆగ్’. దర్శకునిగా రాజ్ కు ‘ఆగ్’ చేదు అనుభవాన్ని చూపింది. తరువాతి సంవత్సరం ‘బర్సాత్’ లో నటిస్తూ, దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచీ నటదర్శకునిగా తనదైన బాణీ పలికిస్తూ రాజ్ సాగారు. “అందాజ్, సర్గమ్, జాన్ పెహచాన్, దస్తాన్, బావ్రే నయన్” చిత్రాలలో రాజ్ అభినయం ఆకట్టుకుంది. 1951లో రాజ్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ఆవారా’ అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా రష్యాలోనూ విజయభేరీ మోగించింది. “శ్రీ 420, సంగం” చిత్రాలు సైతం ఎంతగానో అలరించాయి. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని రూపొందించిన ‘మేరా నామ్ జోకర్’ పరాజయం పాలయింది. తరువాత నటునిగా అవకాశాలు తగ్గించుకొని, తనయుడు రిషీ కపూర్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘బాబీ’ రూపొందించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత రాజ్ దర్శకత్వంలో “సత్యం శివం సుందరం, ప్రేమ్ రోగ్, రామ్ తేరీ గంగా మైలీ” వంటి సినిమాలు తెరకెక్కి జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తరువాతి రోజుల్లోనూ నటునిగా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేశారు రాజ్.
చిత్రసీమకు రాజ్ కపూర్ అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం ఆయనను 1971లో పద్మభూషణ్ అవార్డుతోనూ, 1987లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతోనూ గౌరవించింది. 1988 జూన్ 2న రాజ్ కపూర్ తుదిశ్వాస విడిచారు. రాజ్ నటించిన సినిమాలు, దర్శకత్వం వహించిన చిత్రాలు, ఆయన నాయికల అందాల గురించీ, ఇప్పటికీ జనం చర్చించుకుంటూనే ఉన్నారు. ఏది ఏమైనా మన దేశంలో ‘షో మేన్’ అనే పేరు సంపాదించిన తొలి నటునిగా రాజ్ కపూర్ నిలచి పోయారు.