ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లో ఓ యోగి పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించబోతున్నారన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. సినిమా షూటింగ్ చివరిలో చిత్రీకరణ జరుపుకుంది ఆయనకు సంబంధించిన సన్నివేశాలే అనే ప్రచారం కూడా జరిగింది. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న దానిని బట్టి ‘రాధేశ్యామ్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైతం ఇప్పటికే పూర్తి చేసుకుందట. కానీ ఆ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే తాజాగా ఇందులో ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్ర పోషిస్తున్నట్టు ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.
ఓ పక్క ఆల్ ఇండియా స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతుంటే మరో పక్క చడీ చప్పుడూ లేకుండా ఇలా కృష్ణంరాజు కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది చిత్ర బృందం. అందాల భామ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ పాటలు చార్ట్ బస్టర్స్ లో టాప్ పొజిషన్ లో నిలుస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఇదే పరిస్థితి. మరి సంక్రాంతి కానుకగా జనవరి 14న జనం ముందుకు వస్తున్న ‘రాధేశ్యామ్’కు సంబంధించిన ఇంకెన్ని విశేషాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయో చూడాలి.