Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. గంభీరమైన వాయిస్.. దడ పుట్టించే ముఖంతో కనిపించినా ఆయన మనస్సు ఎప్పుడు వెన్ననే. తిండి పెట్టి చంపేస్తారు అనే మాట కృష్ణంరాజు కు మాత్రమే చెల్లుతోంది అంటే అతిశయోక్తి కాదు. పెద్ద, చిన్న.. ధనిక, పేద అని తేడాలేకుండా అందరికి అన్నం పెట్టిన చేతులు ఉప్పలపాటి కుటుంబానివి. ఇక ఆ సామ్రాజ్యపు రారాజు నేడు దివికేగాడు. ఈ వార్త విన్న చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం కృష్ణంరాజు ఇంట ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి సినీ, రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. ఇక ప్రతి ఒక్కరికి తమ పుట్టుక గురించి తెలియదు.. కానీ మరణం అంటూ వచ్చినప్పుడు తాము ఎలా చనిపోవాలి మాత్రం ఎంచుకొనే అవకాశం ఉంటుంది అంటారు. అలానే కృష్ణంరాజు కూడా తన చావు గురించి ఒక మాట అనుకున్నారట. తాను ఎలా చనిపోవాలి కూడా ముందే డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్నీ ఒక పాత ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు.
“నాకు చావు అంటూ వస్తే.. ఆ సమయంలో నేను పచ్చని చెట్టు కింద కూర్చొని నా జీవితంలో నేను ఎవ్వరిని నొప్పించలేదు. నా వలన ఎవరు బాధపడలేదు.. ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు అన్న గర్వంతో ఆకాశం వైపు చూస్తూ కన్ను మూయాలి” అని ఉందని చెప్పారు. అదే ఆయన చివరి కోరిక అని కూడా చెప్పారు. నిజంగానే ఆయన చివరి కోరిక నెరవేరిందనే అంటున్నారు ఉప్పలపాటి సన్నిహితులు. చెట్టు కింద కూర్చొని రతి చెందకపోయినా కృష్ణంరాజు జీవితంలో, కెరీర్ లో ఒకరికి అన్యాయం చేసినట్లు దాఖలాలు లేవు. ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. చివరి రోజుల్లోనూ అంతే ఆనందాన్ని మూటకట్టుకొని తుదిశ్వాస విడిచారు. ఈ లెక్కన చెప్పాలంటే ఆయన అనుకున్న చావునే దేవుడు ఆయనకు ప్రసాదించాడు అన్నమాటే.