Raviteja: మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఈ తేదీని చాలా రోజుల క్రితమే మేకర్స్ లాక్ చేసి పెట్టారు. తాజాగా అదే తేదీన కిరణ్ అబ్బవరం మూవీ ‘మీటర్’ను విడుదల చేయబోతున్నట్టు దాని దర్శక నిర్మాతలు బుధవారం ప్రకటించారు. దాంతో ప్రస్తుతం టాలీవుడ్ లో వీరిద్దరికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే… ‘క్రాక్’ తర్వాత రవితేజ నటించిన సినిమాలు వరుస పరాజయం పాలయ్యాయి. తిరిగి లాస్ట్ ఇయర్ చివరిలో ‘థమాకా’తో రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లోనూ రవితేజ కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమా కూడా చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన ‘రావణాసుర’ ఏప్రిల్ 7న రాబోతోంది. ఈ సినిమా కూడా హిట్ అయితే… రవితేజ బాక్సాఫీస్ బరిలో హ్యాట్రిక్ సాధించినట్టు అవుతుంది.
అభిషేక్ అగర్వాల్ తో కలిసి రవితేజ స్వీయ నిర్మాణ సంస్థ ‘రావణాసుర’ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున మేనల్లుడు, ప్రముఖ నటుడు సుశాంత్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో వీరిద్దరి మధ్య ఓ భారీ యాక్షన్ సీన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలానే రవితేజ సరసన నటించిన కథానాయికల జాబితాను చూస్తుంటే… అతను సమ్ థింగ్ స్పెషల్ క్యారెక్టర్ ను చేసినట్టే అర్థమౌతోంది. సో… ‘రావణాసుర’తో రవితేజ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మీటర్’ మూవీ కూడా అదే తేదిన వస్తుండటం, అది కూడా మాస్ యాక్షన్ మూవీ కావడంతో కొందరిలో సందేహాలు మొదలయ్యాయి.
‘రాజావారు రాణిగారు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరంకు ఆ తర్వాత ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’ మంచి విజయాన్ని అందించింది. కానీ ఆ తర్వాత వరుసగా కిరణ్ అబ్బవరం మూడు పరాజయాలను మూటగట్టుకున్నాడు. బట్.. తాజాగా వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తిరిగి అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ‘మీటర్’ మూవీ విజయం అతనికి కీలకమైందనే చెప్పాలి. ఇందులో కిరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో కలిసి దీన్ని నిర్మిస్తోంది. అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో రమేశ్ కాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కిరణ్ అబ్బవరం ఇంతవరకూ 6 సినిమాలలో హీరోగా నటించాడు. కానీ ఏ సినిమా కూడా రవితేజ మూవీతో పోటీగా విడుదల కాలేదు. అతని కెరీర్ లోనే రవితేజా మూవీ ఢీ కొట్టడం ఇదే మొదటిసారి. సో.. ఏప్రిల్ 7న రాబోతున్న ‘రావణాసుర’, ‘మీటర్’ సినిమాలలో ఏది విజయం సాధిస్తుందో వేచి చూడాలి.