ఇప్పుడు బారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో రశ్మికా మందణ్ణ ఒకరు. అనతికాలంలోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించుకోవడం, పాన్ ఇండియా నటిగా అవతరించడంతో.. మేకర్స్ ఈమె వెనకాలే పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐటెం సాంగ్ కోసం రశ్మికాను సంప్రదించినట్టు కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ సినిమాలో అనుకున్నారు..? డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతోన్న ‘జన గణ మన’.
ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పూరీ, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్‌గా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే మాస్ ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేకమైన ఐటెం సాంగ్ డిజైన్ చేశాడని, అందుకోసం రశ్మికాని రంగంలోకి దింపనున్నాడని ఈ న్యూస్ తెరమీదకొచ్చింది. విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా.. ‘జన గణ మన’లో ఐటెం సాంగ్ చేసేందుకు రశ్మికా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. రశ్మికా ఒప్పుకోవడం కాదు కదా.. అసలు ‘జన గణ మన’లో ఐటెం సాంగే లేదని తెలిసింది.
‘‘జన గణ మన ఓ పేట్రియాటిక్ సినిమా. ఇలాంటి సినిమాల్లో ‘ఐటెం సాంగ్’ ఎలా పెడతారు? ఆ వార్తల్లో నిజం లేదు. ఇదో పూర్తిస్థాయి దేశభక్తి సినిమా మాత్రమే’’ అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయాలని పూరీ అనుకున్నాడు. కానీ, ఎందుకో అది వీలు పడలేదు. చాలాకాలం నిరీక్షణ తర్వాత, ఇప్పుడు విజయ్‌తో రంగంలోకి దిగాడు పూరీ.