నటునిగా తనదైన బాణీ పలికించిన రంగనాథ్ ఎంతో సౌమ్యుడు. ఒకప్పుడు హీరోగా నటించి అలరించిన ఆయన కేరెక్టర్ యాక్టర్ గానూ రక్తి కట్టించారు. ఎందరిలోనో స్థైర్యం నింపిన రంగనాథ్ చివరకు ఆత్మహత్యతో అసువులు బాయడం అభిమానులను కలచి వేస్తూనే ఉంది.
రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. 1949 జూలై 17న రంగనాథ్ జన్మించారు. పేరుగా తగ్గట్టే సుందర రూపుడు. ఆరడగుల ఎత్తు. చూడగానే ఆకట్టుకొనే రూపం. చదువుకొనే రోజుల నుంచీ పలు అంశాలపై కవితలు రాసి, సన్నిహితులను అలరించారు. ఆ రోజుల్లోనే నాటకాలన్నా, వాటిలో నటించడమన్నా రంగనాథ్ కు ఎంతో ఆసక్తి. బి.ఏ. చదివిన రంగనాథ్ కొంతకాలం రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేశారు. మిత్రుల ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని చిత్రాలలో కనీకనిపించని పాత్రలు కూడా పోషించారు. 1974లో ‘చందన’ సినిమాతో రంగనాథ్ కు హీరోగా అవకాశం లభించింది. తొలి సినిమాలోనే హీరోగా నటించిన రంగనాథ్ ఆ తరువాత హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ పోయారు. సింగీతం శ్రీనివాసరావు, రంగనాథ్ ను ప్రోత్సహించారని చెప్పాలి. తాను తెరకెక్కించిన “జమీందార్ గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, అందమె ఆనందం, పంతులమ్మ” వంటి చిత్రాలలో రంగనాథ్ కు హీరోగా అవకాశాలు కల్పించారు. ఈ చిత్రాలు రంగనాథ్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అలాగే “చదువు-సంస్కారం, సెక్రటరీ, లాయర్ విశ్వనాథ్, రామయ్య తండ్రి, రామచిలక, దేవతలారా దీవించండి, ఇంటింటి రామాయణం, తాయారమ్మ-బంగారయ్య, లవ్ ఇన్ సింగపూర్” వంటి చిత్రాలలో కథానాయకుడుగా, ఉప నాయకునిగా నటించి మెప్పించారు రంగనాథ్.
హీరోగా అవకాశాలు తగ్గు ముఖం పట్టగానే కేరెక్టర్ రోల్స్ కు మారిపోయారాయన. కేరెక్టర్ యాక్టర్ గా రంగనాథ్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అనేక చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ గా హుందాగా నటించి అలరించారు. వైవిధ్యం కోసం ‘గువ్వలజంట, రక్తాభిషేకం” వంటి చిత్రాలలో విలన్ గానూ కనిపించారు. అయితే సదరు చిత్రాలేవీ ఆయనకు అంతగా కలసి రాలేదు. కొన్ని టీవీ సీరియల్స్ లోనూ రంగనాథ్ నటించారు. భార్య మరణం రంగనాథ్ ను కుంగదీసింది. ఏదో నటనలో పడి అలా అలా నెట్టుకు వచ్చారు. ఎందరిలోనో స్థైర్యం నింపిన రంగనాథ్, ఆత్మస్థైర్యం కోల్పోయారు. 2015 డిసెంబర్ 19న ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు, కవితలతో ఎందరినో అలరించారు. అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. సున్నిత మనస్కుడైన రంగనాథ్ ను ఏదో బాధ అలా చేయడానికి దారి తీసి ఉంటుందని అభిమానులు, సన్నిహితులు భావించారు. ఏది ఏమైనా ఆయన హుందా నటనను జనం మరచిపోలేరు.