కంటెంట్ లో కాస్తంత దమ్ము ఉండాలే కానీ హారర్ థ్రిల్లర్స్ ను ఇప్పటికీ జనం ఆదరిస్తూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఆ జానర్ లో నరసింహ జీడీ ‘నఘం’ అనే సినిమాను తెరకెక్కించారు. గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శివ దోసకాయల నిర్మించారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నఘం’ మూవీ టీజర్ ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ”హారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ గారి చేతుల మీదుగా మా టీజర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. టీజర్ లో ఒక్క డైలాగ్ లేకపోయినా.. ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. అరవింద్ కెమెరా పనితనం, భగవత్ సంగీతం అద్భుతంగా కుదిరాయి. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఉండాల్సిన మూడ్‌ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా భగవత్ తీసుకొచ్చారు. అతి త్వరలోనే నిర్మాణానంతర పనులను పూర్తి చేసి మూవీని జనం ముందుకు తీసుకొస్తాం” అని అన్నారు.