ఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకెక్కే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఓ పోలీస్ కేసుతో తెరమీదకొచ్చారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆయన నట్టి క్రాంతి, కరుణ అనే వ్యక్తులపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించిన వర్మ.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో తన సంతకాన్ని వాళ్ళు ఫోర్జరీ చేసినట్టు అందులో పేర్కొన్నారు. 2020 నవంబర్ 30వ తేదీన తన లెటర్ హెడ్ తీసుకొని, నకిలీ పత్రాల్ని సృష్టించి, ఫోర్జరీ సంతకంతో వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సృష్టించారని వర్మ తెలిపారు. తన ‘డేంజరస్’ సినిమా రిలీజ్‌ని ఆపేందుకే వాళ్ళు ఈ డ్రామాకి తెరలెపారని పేర్కొన్నారు.
ఏప్రిల్ 8న తన డేంజరస్ రిలీజ్ కావాల్సి ఉండగా.. 7వ తేదీ ఆ సినిమా రిలీజ్ ఆపాల్సిందిగా తనకు కోర్టు స్టే విధించిందని వర్మ వెల్లడించారు. ఆ డాక్యుమెంట్ తన వద్దకు వచ్చినప్పుడే అది ఫ్రాడ్ అని తనకు అర్థమైందని, దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికే పోలీస్ స్టేషన్‌కు వచ్చానని అన్నారు. ఫోర్జరీ సంతకాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిజానిజాలు తేల్చాలని వర్మ డిమాండ్ చేశారు. ఓ సినిమాకు తాను రూ. 50 లక్షలు ఇస్తానని ‘పేమెంట్ అస్యూరెన్స్ నోటీసు’లో తాను సంతకం పెట్టినట్టు.. నట్టి క్రాంతి, కరుణ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించినట్టు ఆయన వివరించారు. వాళ్ళతో పాటు తన సంతకం కూడా ఆ డాక్యుమెంట్‌లో ఉండడంతో.. వారిపై ఫోర్జరీ సంతకం కేసు పెట్టానని వర్మ వెల్లడించారు.