సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలపై ఒమిక్రాన్ దెబ్బ పడుతుందని సినీ లవర్స్ లో టెన్షన్ ఎక్కువైంది. మేకర్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులే ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయా భారీ బడ్జెట్ సినిమాలపై వస్తున్న రూమర్స్ ప్రేక్షకులను కంగారు పెట్టేస్తున్నాయి. మరోపక్క కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయేమో అనే అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఇలాంటి అనుమానాలే మరోసారి మొదలయ్యాయి.
ఢిల్లీలో తాజాగా నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్లు మూతపడడం, ఇక చిత్రబృందం ఎక్కువగా ఫోకస్ చేస్తున్న మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు ఈ అనుమానాలకు కారణం. అయితే జక్కన్న మాత్రం ఏదేమైనా వెనక్కి తగ్గేదే లే అంటున్నాడు. సినిమా వాయిదా పడే అవకాశం లేదని, ప్రకటించిన విధంగా జనవరి 7న విడుదలవుతుందని రాజమౌళి స్వయంగా తనతో చెప్పినట్లు ప్రముఖ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ ద్వారా ధృవీకరించారు. సినిమా విడుదల వాయిదా పడుతుందేమోనని ఆందోళనలో ఉన్న అభిమానులందరికీ ఇది శుభవార్త అని చెప్పాలి.