R Narayana Murthy: మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మనసు వెన్న అని అందరికి తెల్సిందే. ఆమె మంచి మనస్సు తెలిసినవారు ఎవరు కూడా ఆమె గురుంచి నెగెటివ్ గా మాట్లాడారు. సావిత్రికి ఎంత మంచి మనసు ఉందో .. అంతే పంతం కూడా. ఒకరకంగా చెప్పాలంటే మొండితనం ఎక్కువ. మహానటి సినిమాలో చూపించినట్లు.. నటన ఇష్టం లేకపోయినా.. తనకు రాదు అన్నారనే పంతంతో పట్టుబట్టి నటిగా మారిన మొండిది సావిత్రి. అంతేనా.. జెమిని గణేష్ ను ప్రేమించినప్పుడు.. ఆల్రెడీ అతని పెళ్లి అయ్యింది, పిల్లలు ఉన్నారు అని తెల్సినా కూడా తాను మార్చుకుంటాను అని చెప్పి పెళ్లి చేసుకున్న ఘటికురాలు. ఇక పెళ్లి తరువాత భర్తను పిచ్చిగా ప్రేమించి మోసపోయి మద్యానికి బానిసగా మారి.. రూపాయి కూడా లేని స్థితిలో ఉన్నా.. అవసరం అన్నవారికి అప్పు చేసి మరీ ఆదుకున్న దేవత ఆమె. ఇక ఇదే పంతంతో సావిత్రి.. ఒక జర్నలిస్ట్ తో గొడవపడి కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలుసా.. ? తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్, నారాయణమూర్తి ఈ విషయాన్నీ తెలిపారు.ఒకప్పుడు మీడియా ఎలా ఉండేది.. ఇప్పుడు మీడియా ఎలా ఉంటుంది అన్న ప్రస్తావనలో సావిత్రికి జరిగిన ఒక చేదు అనుభవం గురించి ఆయన మాట్లాడారు.
“మహానటి సావిత్రి, పరమేశ్వర అనే జర్నలిస్టుకు మధ్య విబేధాలు వచ్చాయి. సావిత్రి మీద కొన్ని వివాదస్పద కథనాలు రాయడంతో సావిత్రి అహం దెబ్బతింది. దీంతో కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇద్దరూ కోర్టు చుట్టూ తిరిగారు. సావిత్రి కోర్టుకు రావడంతో జనం కుప్పలుతెప్పలుగా వచ్చేవారు. ఇక ఇదంతా చూసిన కోర్టు.. ఏంటి ఈ గోల అని ఎలాగోలా ఆ సమస్యను పరిష్కరించారు. ఆ తరువాత చాలామంది సావిత్రి క్యారెక్టర్ ను దిగజార్చి మాట్లాడారు. కొంతమంది అయితే కొట్టబోయారు. కేవలం వారి ఈగోల వలన అది జరిగింది. ఎంతో మంది జర్నలిస్టులను కన్నది సినిమా తల్లి. ఆ రోజుల్లో వారం రోజులకు తర్వాతే రివ్యూలు రాసేవారు. కానీ ఇప్పుడు మార్నింగ్ షోకే రాస్తున్నారు. ఇవాళ సినిమా మూడు రోజులే బతుకుతోంది. సినిమా గురించి రాస్తున్నప్పుడు దయచేసి సినిమాను చంపేయకండి. కేరక్టర్ అసాసినేషన్ చేయకండి. నన్నని కాదు.. ఎవరి గురించైనా రాసేటప్పుడు ఆలోచించి రాయండి. దయ ఉంచి తప్పుడు రాతలు రాయకండి. సినిమా ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో 90 శాతం సగటు నిర్మాతలున్నారు. కానీ 10 శాతమే విజయం ఉంది. మిగలిన 90 శాతం ఎలా ఉంది? మీడియాలో భారీ సినిమాలనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి? అన్నీ చూడండి.. అందరినీ ప్రోత్సహించండి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.