అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ ద రైజ్ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ స్థాయి వసూళ్ళతో ప్రదర్శితం అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మలయాళ వెర్షన్ శనివారం నుంచి ప్రదర్శితం కానుంది. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప’ ద రూల్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలు పెడతామని చెబుతున్నారు నిర్మాతలు. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ హడావుడిగా చేయటం వల్ల టెక్నికల్ లాప్స్ వచ్చిన మాట నిజమేనని, మలయాళ వెర్షన్ కూడా ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేశామని, కానీ సెకండ్ పార్ట్ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని రెండు నెలలు ముందుగానే కానీ సిద్ధం చేసి చక్కగా ప్రచారం చేస్తామని అంటున్నారు.
‘పుష్ప’ తొలి భాగం హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో కూడా ఇబ్బంది ఎదురైంది. రెండు రోజులు ముందు సెన్సార్ పూర్తి చేసి బాలీవుడ్ లో ఈవెంట్ చేసి ఉంటే తొలి రోజు వసూలు చేసిన దానికి రెట్టింపు వసూళ్లు వచ్చి ఉండేవని బాలీవుడ్ పంపిణీదారులు గోల్డ్ మైన్ ఫిలిమ్స్ వారు తెలిపినట్లు నిర్మాతలే చెబుతున్నారు. మరి అన్న మాట ప్రకారం సెకండ్ పార్ట్ ని పక్కా ప్లాన్ తో రిలీజ్ చేయగలుగుతారేమో చూద్దాం.