Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!

Rajav

Rajav

‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఫలితంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా బదులిచ్చారు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి గల ప్రధాన కారణాలు, తాము చేసిన తప్పులను విశ్లేషిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ది రాజా సాబ్’ విషయంలో జరిగిన అతిపెద్ద ఫండమెంటల్ మిస్టేక్ రిలీజ్ టైమింగ్ అని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. “సినిమా వచ్చిన సీజన్ కరెక్ట్ కాదు. అదే వేరే ఏ ఇతర టైమ్‌లో రిలీజ్ అయినా ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది” అని అభిప్రాయపడ్డారు.

టికెట్ రేట్లు పెంచడానికి ప్రయత్నించడం సినిమాపై నెగెటివ్ ప్రభావం చూపిందని ఆయన అంగీకరించారు. “మేము టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నించిన మొదటి సినిమా ఇది. నిజానికి ఆ పని చేయకుండా ఉండాల్సింది. దానివల్ల రిలీజ్ ఆలస్యం కావడం, ప్రేక్షకులు-ఫ్యాన్స్ తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అవ్వడం జరిగాయి” అని వివరించారు. సినిమాకు సైజ్, స్కేల్ పరంగా బెస్ట్ రిలీజ్ దక్కినప్పటికీ.. రిలీజ్ రోజే ప్రీమియర్ షోలు డిలే కావడం వంటి పలు సాంకేతిక, ఇతర సమస్యలు కూడా సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు.

‘రాజా సాబ్’ నిరాశపరిచినా, చేతిలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ తెలుగు హక్కులు మీ దగ్గరే ఉన్నాయి కదా.. దాంతో ఆ లోటు భర్తీ చేస్తారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా.. “‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించి నేను కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్‌ను మాత్రమే” అని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. సాధారణంగా పెద్ద సినిమాల ఫలితాలపై నిర్మాతలు త్వరగా స్పందించడానికి ఇష్టపడరు. అయితే, ఏమాత్రం దాపరికం లేకుండా సీజన్ ఎంపిక, రిలీజ్ రోజు ప్రీమియర్ల ఆలస్యం, టికెట్ రేట్ల పెంపు నిర్ణయాలే సినిమాపై ప్రతికూల ప్రభావం చూపాయని టీజీ విశ్వప్రసాద్ నిజాయితీగా అంగీకరించడం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.