దర్శకుడు రాంగోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆయన సినిమాలేవీ రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, కరుణలపై వర్మ కేసు పెట్టిన నేపథ్యంలో.. నట్టికుమార్ తీవ్రంగా స్పందించారు. తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. ఆర్జీవీ తన పిల్లలపై తప్పుడు కేసులు పెట్టాడని ఫైరయ్యారు.
తమ దగ్గర నుంచి వర్మ డబ్బులు బాగా తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే మాత్రం ఫేక్ అంటూ చేతులు ఎత్తేస్తున్నాడని ఆగ్రహించారు. తమతో పాటు చాలామంది నిర్మాతల్ని వర్మ మోసం చేశాడని ఆరోపించారు. అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఒక్కటయ్యామని, ఇక వర్మ పని అయిపోయిందని నట్టికుమార్ వార్నింగ్ ఇచ్చారు. వర్మ సినిమాలేవీ విడుదల కాకుండా చేస్తామని అన్నారు. వర్మ పేరు మీద సినిమా వస్తే, సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే, స్టే తీసుకొస్తామని చెప్పారు. నిర్మాతలెవరూ వర్మతో సినిమా చేయొద్దని నట్టికుమార్ కోరారు.
ఇదిలావుండగా.. ఓ సినిమాకు తాను తీసుకున్న డబ్బులు తిరిగిస్తానని ఒక పేమెంట్ అస్యూరెన్స్ లెటర్‌పై తాను సంతకం చేసినట్టు నట్టి క్రాంతి, కరుణ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారని వర్మ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని వాళ్ళు పోర్జరీ చేశారన్నారు. వారి వల్లే ఏప్రిల్ 8న రిలీజ్ కావాల్సిన తన సినిమా ఆగిపోయిందని వర్మ శనివారం ఉదయం కేసు నమోదు చేశాక మీడియాతో అన్నారు.