ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రవి చేతనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను పోలీసులు డిలీట్ చేయించారు. దాంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాత సి కళ్యాణ్, ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. పైరసీ చేసే వారిని ఎన్‌కౌంటర్ చేయాలన్నారు.
‘సినిమా పైరసీ చేసే వారిని ఎన్‌కౌంటర్ చేయాలి. వందల మంది కష్టం సినిమా. ఛాంబర్ పైరసీ సెల్ పైరసీని అరికట్టే విషయంలో ఎంతో కృషి చేస్తుంది. ఇక్కడే కాదు.. విదేశీ సినిమాల విషయంలో కూడా పైరసీని అరికట్టేందుకు ఎన్నో చేసింది. అస్ట్రేలియా, ఫ్రెంచ్ వారు కూడా అభినందించారు. ఐబొమ్మ వాళ్లను పట్టుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్‌కు ధన్యవాదములు. పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వంతో కలసి ముందుకు వెళ్తాము’ అని నిర్మాత సి కళ్యాణ్ చెప్పారు.
Also Read: Sabarimala Devotees: శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం!
ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ మాట్లాడుతూ… ‘పైరసీ చేస్తున్న వాళ్లను అరెస్ట్ చేసిన తెలంగాణా ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్ గారికి ధన్యవాదాలు. ఛాంబర్‌కు సంబంధించిన వీడియో పైరసీ సెల్.. పైరసీకి అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తుంది’ అని తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకులు కొన్ని రోజులు క్రితం పోలీసులనే సవాల్ చేస్తూ ఒక మెసేజ్ రిలీజ్ చేయడంతో.. ఐబొమ్మకు పోలీసులు నిజంగానే బొమ్మ చూపించారు. ఇన్నాళ్లుగా దాక్కున్న ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.