Murali Mohan: అజాత శత్రువు మురళీ మోహన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జగమే మాయ’తో చిత్రసీమలో ప్రవేశించిన మురళీ మోహన్ ఈ మాయా జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నారు. నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ తీరు ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరించడం, తనను ఆశ్రయించిన వారికి సాయం చేయడం, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం వంటివి ఆయన వ్యాపకాలు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనదైన బాణీ పలికించటమే కాదు ‘జయభేరీ’ అధినేతగా మరపురాని చిత్రాలను అందించారు. ఇక రియల్ ఎస్టేట్ లోనూ జయభేరీ మ్రోగించిన మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగానూ పని చేశారు. మురళీ మోహన్ ఈ జూన్ 24తో 83 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఎంతో చురుగ్గా ఉంటూ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికీ సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు చదువుకోవాలనుకొనే నిరుపేదలకు చేయూతను అందిస్తున్నారు.
మురళీ మోహన్ అసలు పేరు మాగంటి రాజాబాబు. 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ఆయన జన్మించారు. కుటుంబ వ్యాపారం చూసుకుంటూ మదరాసుకు తరచూ వెళ్ళేవారు. ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ ‘మన’సత్యం దగ్గరకు ఓ మిత్రుణ్ణి ఫోటో తీయించడానికి తీసుకు వెళ్ళారు. ఆ సమయంలో ‘నువ్వే హీరోలా ఉన్నావ్, సినిమాల్లో ట్రై చేయరాదూ’ అంటూ సత్యం సలహా ఇచ్చారు. దాంతో మురళీమోహన్ కూడా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటికే మిత్రులు కొందరు చిత్రసీమలో ఉండడంతో మురళీమోహన్ కూడా ఉత్సాహంగా సినిమా వైపు పరుగులు తీశారు. 1973లో ‘జగమే మాయ’ చిత్రంలో తొలిసారి నటించిన మురళీమోహన్ ఆ తరువాత హీరో వేషాలే వేస్తానని మడి కట్టుకు కూర్చోలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ పోయారు. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, ఛటర్జీ, విజయబాపినీడు వంటివారు మురళీమోహన్ ను భలేగా ప్రోత్సహించారు. కొన్నిసార్లు హీరోని చేశారు, మరికొన్ని సార్లు కేరెక్టర్ యాక్టర్ గానూ చూపారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
మురళీమోహన్ నటజీవితంలో 1978వ సంవత్సరం మరపురానిది. ఆ సమయంలో యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ అందరూ బిజీగా వరుస సినిమాలు చేశారు. అయినా ఆ సంవత్సరం మురళీమోహన్ హీరోగా రూపొందిన ‘పొట్టేలు పున్నమ్మ’ అనూహ్య విజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. మురళీమోహన్ హీరోగా నటించిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. అయినా సైడ్ హీరో రోల్స్ ను మాత్రం వీడలేదు. గిరిబాబు ‘జయభేరి’ సంస్థ నెలకొల్పి తెరకెక్కించిన చిత్రాల్లో మురళీమోహన్ కీలక పాత్రలు పోషించారు. తరువాత అదే బ్యానర్ ను మురళీమోహన్ సొంతం చేసుకొని అనేక మరపురాని చిత్రాలను నిర్మించారు. కొన్నిట తానే హీరోగా నటించారు. మరికొన్నిటిలో ఇతరులను హీరోలుగా పెట్టి సినిమాలు తెరకెక్కించారు. ఆయన నూరవ చిత్రంగా రూపొందిన ‘పిచ్చి పంతులు’ కూడా జయభేరీ చిత్రమే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సమయంలో యన్టీఆర్ రాజకీయప్రవేశం చేశారు. అందులో “రామయ్యా రావయ్యా…” అంటూ రూపొందించిన పాట ఆ రోజుల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మురళీమోహన్ హైదరాబాద్ మకాం మార్చారు. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు రియల్ ఎస్టేట్ లో కాలు మోపారు. ‘భూమిని నమ్ముకుంటే అది మనల్ని కాపాడుతుంది’ అన్న శోభన్ బాబు సూత్రాన్ని అనుసరిస్తూ మురళీమోహన్ తాను రియల్ ఎస్టేట్ లో అడుగు పెట్టానని చెబుతారు. నిజంగానే రియల్ ఎస్టేట్ లో ఆయన ‘జయభేరీ’ మోగించారు. ఇక తమ జయభేరీ పతాకంపై ఆయన నిర్మించిన చివరి చిత్రం ‘అతడు’.
ఆ సినిమా అప్పట్లో ఆయనకు ఆట్టే లాభాలు సంపాదించి పెట్టలేకపోయింది. అయితే, విచిత్రంగా బుల్లితెరపై ‘అతడు’ విశేషంగా అలరించింది. ఆ సినిమా తెచ్చిన నష్టాన్ని శాటిలైట్ పూడ్చేసింది. చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరి, 2009లో రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసి, పరాజయాన్ని చవిచూశారు. 2014లో అదే నియోజక వర్గం నుండి టీడీపీ టిక్కెట్టు పైనే గెలుపు సాధించారు. తరువాత రాజకీయాలకు దూరంగా జరిగారు. ఎనభై ఏళ్ళు పైబడినా, ఇప్పటికీ ఉరకలు వేసే ఉత్సాహంతో ఉన్న మురళీమోహన్ ను చూస్తే, ఆయన వయసులో సగం ఉన్నవారికి కూడా స్ఫూర్తి కలుగుతుంది. ‘నవ్వేందుకే ఈ జీవితం… నవ్వొక్కటేరా శాశ్వతం…’ అన్నది మురళీమోహన్ ఫిలాసఫీ. ఎలాంటి సమస్య ఎదురైనా నవ్వుతూనే ఎదుర్కోవడమూ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందరివాడుగా నిలచిన మురళీమోహన్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?