Priyamani To Play Key Role In Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు! ముఖ్యంగా.. పరభాష పరిశ్రమల్లో అది సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లో అయితే ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి, అందరినీ షాక్‌కి గురి చేసింది. ఇలా నమ్మశక్యం కాని విజయాన్ని నమోదు చేయడం వల్ల.. దర్శకుడు సకుమార్ రెండో భాగంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముందుగా అనుకున్న కథని పూర్తిగా మార్చేసి, సరికొత్త మెరుగులు దిద్దుతున్నాడు. కొత్త కొత్త పాత్రల్ని కూడా డిజైన్ చేస్తున్నాడు. వీటి కోసం ప్రముఖ నటీనటుల్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక కీలక పాత్ర కోసం ఓ నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆ నటి మరెవ్వరో కాదు.. ప్రియమణి. ఈమె పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తోన్న విజయ్ సేతుపతికి భార్యగా ఆమె కనిపించనున్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి.. విజయ్ సేతుపతిని ఫహాద్ ఫాజిల్ పాత్రకే సంప్రదించారు. అప్పుడు అతను సుముఖత వ్యక్తం చేశాడు కానీ, చివరి నిమిషంలో ప్రాజెక్ట్ తప్పుకున్నాడు. అయితే, ఇప్పుడు రెండో భాగంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అతని భార్యగానే ప్రియమణిని రంగంలోకి దింపుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే.. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర మరింత స్ట్రాంగ్‌గా ఉండనుందట! ఇందులో అతని సరసన రశ్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోంది. ఇక ఫహాద్ ఫాజిల్ ‘భన్వర్ సింగ్ షెకావత్’ అనే విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే! తొలి పార్ట్‌లో కనిపించిన అనసూయ, సునీల్‌లకు ఈ సీక్వెల్‌లో మరింత ప్రాధాన్యత ఉండనుందని గతంలోనే పలు ఇంటర్వ్యూలో సుకుమార్ వెల్లడించాడు. చూస్తుంటే, సీక్వెల్ కోసం ఈ క్రియేటివ్ డైరెక్టర్ చాలా పెద్ద ప్లాన్ వేసినట్టే కనిపిస్తోంది.