Kay Kay Menon : బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సినిమాలకే కాదు వెబ్ సీరిస్ లకూ మంచి క్రేజ్ ఉంది. అందుకు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీరిస్ ఓ ఉదాహరణ. తాజాగా వాళ్ళు రూపొందించిన ‘ఫర్జీ’ వెబ్ సీరిస్ ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. భారతదేశంలో నకిలీ నోట్ల దందాకు ప్రధాన కారకుడైన మన్సూర్ దలాల్ పాత్రను ప్రముఖ నటుడు కె. కె. మీనన్ పోషిస్తున్నాడు. అతన్ని పట్టుకుని ఆ అకృత్యాలకు అడ్డుకట్ట వేసే మైఖేల్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రను విజయ్ సేతుపతి చేస్తున్నాడు. తాజాగా ప్రైమ్ సంస్థ ‘ఫర్జ్’లోని మన్సూర్ దలాల్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా కె.కె. మీనన్ మాట్లాడుతూ, ”డిజిటల్ మీడియాలో ఇలాంటి భిన్నమైన పాత్ర పొందడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ‘ఫర్జ్’లోని ఈ పాత్ర విపరీతంగా అక్రమార్జనకు పాల్పడుతుంటుంది. దాంతో కాస్తంత వైవిధ్యంగా దానిని పోషించే ఆస్కారం ఏర్పడింది. ప్రతి సన్నివేశం చిత్రీకరణ తర్వాత నా పెర్ఫార్మెన్స్ గురించి దర్శకులు ఎలా స్పందిస్తారా అని ఎదురుచూస్తుండేవాడిని. రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ థ్రిల్లర్ ను చాలా బాగా డీల్ చేశారు. వాళ్ళతో పాటు ఎంతో ప్రతిభ కలిగిన నటీనటులతో వర్క్ చేయడం ఆనందాన్ని కలిగించింది. ఈ వెబ్ సీరిస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా? వ్యూవర్స్ ఎలా రియాక్ట్ అవుతారా? అని ఎదురుచూస్తున్నాను” అని అన్నారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఉండే ‘ఫర్జ్’ వెబ్ సీరిస్ తో షాహిద్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నటుడిగా అవకాశాలు రాకపోవడంతో ఫ్రస్టేషన్ తో నకిలీ నోట్ల దందాకు దిగే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఇండియాతో పాటు వివిధ భాషల్లో మొత్తం 240 దేశాలలో అమెజాన్ ప్రైమ్ ‘ఫర్జీ’ వెబ్ సీరిస్ ను టెలీకాస్ట్ చేయబోతోంది. ఇతర ప్రధాన పాత్రలను రాశీఖన్నా, రెజీనా, అమోల్ పాలేకర్, జాకీర్ హుస్సేన్ తదితరులు పోషించారు.