ప్రేమకథా చిత్రాలకు తిరుగులేదు. అందుకు నాటి ‘పాతాళభైరవి’ మొదలు ఈ నాటికీ వస్తున్న ప్రేమకథా చిత్రాలే నిదర్శనం! ఆ ఉద్దేశంతోనే దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రానికి ప్రేమకథనే ఎంచుకున్నారు. దానికి ‘ప్రేమించుకుందాం…రా!’ అన్న టైటిల్ నూ నిర్ణయించారు. వెంకటేశ్ హీరోగా డి.రామానాయుడు సమర్పణలో సురేశ్ బాబు నిర్మించిన ‘ప్రేమించుకుందాం…రా!’ చిత్రం 1997 మే 9న విడుదలై విజయఢంకా మోగించింది.
‘ప్రేమించుకుందాం…రా!’ కథలోకి తొంగి చూస్తే – రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ వీరభద్రయ్యకు, రెడ్డప్ప అనే శత్రువు ఉంటాడు. తమ ముఠాకక్షల వల్ల కూతురు కావేరి చదువుకు భంగం వాటిల్లకూడదని, కర్నూలులో ఉన్న తమ్ముని దగ్గర ఉంచి చదివిస్తుంటాడు వీరభద్రయ్య. గిరి హైదరాబాద్ లో ఎమ్మెస్సీ చదువుతూ ఉంటాడు. సెలవులకు తన అక్కాబావలు ఉన్న కర్నూలుకు వెళతాడు. గిరి బావ ఓ బట్టల దుకాణం నడుపుతూ ఉంటాడు. వారి పొరుగునే కావేరి బాబాయ్ ఇల్లు. దాంతో కావేరిని చూడగానే గిరి ప్రేమలో పడతాడు. చివరకు వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే కావేరి తండ్రి వీరభద్రయ్యకు ప్రేమపెళ్ళిళ్ళు అంటే గిట్టవు. అతని కుడిభుజం లాంటి శివునికి వీరభద్రయ్య మాట వేదవాక్కు. సొంత తండ్రి తప్పు చేస్తే, అతడిని వీరభద్రయ్య చంపినా ‘రైటే’ అని ఉంటాడు శివుడు. గిరి, కావేరి లేచిపోతారు. వారిని వెదుక్కుంటూ శివుడు తన అనుచరులతో వెళతాడు. గిరి, కావేరి పెళ్ళాడాలనుకున్న సమయంలో శివుడు వారిపై దాడి చేస్తాడు. గిరికి గాయాలవుతాయి. కావేరిని బలవంతంగా రాయలసీమ తీసుకు వెళతారు. గిరిని అతని కన్నవారు ఆసుపత్రిలో చేర్పిస్తారు. గిరి తల్లిదండ్రులను వీరభద్రయ్య బంధిస్తాడు. దాంతో రాయలసీమకు పయనమవుతాడు గిరి. అక్కడ శివుని భార్యాబిడ్డలపై రెడ్డప్ప మనుషులు దాడిచేయబోగా వారిని రక్షిస్తాడు. గిరి మాటలు శివునిలో మార్పు తెస్తాయి. తరువాత తన తల్లిదండ్రులను విడిపిస్తాడు. కావేరిని తీసుకొని వెళ్తూండగా, గిరిని వీరభద్రయ్య చంపబోతాడు. అతడు చేసే ప్రతి పనికి ‘రైట్’ అని చెప్పే శివుడు, అప్పుడు మాత్రం ‘రాంగ్’ అని చెబుతాడు. ‘చంపటానికో…చావటానికో అయితే అసలు మనిషి పుట్టటం దేనికన్నా? …’ అని ప్రశ్నిస్తాడు శివుడు. దాంతో వీరభద్రయ్యలోనూ మార్పు కలుగుతుంది. గిరి, కావేరి రైల్లో వెళ్ళడంతో కథ ముగుస్తుంది.
ఇందులో గిరిగా వెంకటేశ్, కావేరిగా అంజలా ఝవేరి నటించగా, వీరభద్రయ్య పాత్రలో జయప్రకాశ్ రెడ్డి, శివునిగా శ్రీహరి కనిపించారు. చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, గోకిన రామారావు, రఘునాథ రెడ్డి, అశోక్ కుమార్, బెనర్జీ, జీవా, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ఉత్తేజ్, అన్నపూర్ణ, సుధ, రమాప్రభ, రజిత, కల్పనారాయ్, మాస్టర్ ఆనంద్ వర్ధన్, ఆల్ఫోన్సా ఇతర పాత్రధారులు.
దీన్ రాజ్ సమకూర్చిన కథకు, పరుచూరి బ్రదర్స్ మాటలు పలికించారు. ఈ చిత్రానికి మహేశ్ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఆయన కొన్ని పాటలకు స్వరకల్పన చేశాక అనారోగ్యం పాలయ్యారు. దాంతో మూడు పాటలకు మణిశర్మ బాణీలు కట్టారు. అయితే సినిమాలో మాత్రం సంగీత దర్శకునిగా మహేశ్ పేరునే ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యం ఉన్నా, ఇందులో ఫ్యాక్షనిస్టును ప్రతినాయకునిగానే చూపించారు. ఈ సినిమాలో వీరభద్రయ్యగా నటించిన జయప్రకాశ్ రెడ్డి రాయలసీమలోనే జన్మించినా, పెరిగి పెద్దయింది ఆంధ్ర, తెలంగాణలో. దాంతో తన స్వస్థలం వెళ్ళి అక్కడ ప్రజల మాండలికాన్ని నేర్చుకొని సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా సంభాషణలు పలికారు. ఈ సినిమాలో శివునిగా నటించిన శ్రీహరికి మంచిపేరు లభించింది. అంతకు ముందు రామానాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’ చిత్రంలో ఇమ్రాన్ ఖాన్ అనే పాత్రతోనూ శ్రీహరి నటునిగా మంచి మార్కులు సంపాదించారు. ‘ప్రేమించుకుందాం…రా!’ శ్రీహరిని మరో మెట్టు ఎక్కించింది.
ఈ చిత్రానికి సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్ పాటలు రాశారు. “అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది…”, “ప్రేమ కిరీటమే…”, “మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా…”, “చిన్ని చిన్ని గుండెలో…”, “పెళ్ళి కళ వచ్చేసిందే బాలా…”, “ఓ పనై పోతుంది బాబు…” వంటి పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ‘ప్రేమించుకుందాం…రా!’ చిత్రం 1997లో విడుదలై విజయఢంకా మోగించిన బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది. ఈ సినిమా అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని వెంకటేశ్ సూపర్ హిట్ మూవీస్ లో ఒకటిగా స్థానం సంపాదించింది.