ఇటీవల కేరళ ప్రభుత్వం ప్రకటించిన 55వ రాష్ట్రీయ చలనచిత్ర పురస్కారాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అవార్డుల్లో ప్రముఖ నటుడు మమ్ముట్టి తన నటనతో మరోసారి దుమ్ము రేపారు. దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డు ప్రకటన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : Kartik Purnima 2025: పవిత్రత, భక్తి, దీపాల వెలుగులతో 2025 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
ప్రకాశ్ రాజ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. “జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు కొన్నిసార్లు రాజీ పడుతున్నారని చెప్పడంలో నాకు ఎటువంటి సంకోచం లేదు. కానీ కేరళ రాష్ట్ర అవార్డుల కమిటీ మాత్రం చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించింది. వాళ్లు నన్ను సంప్రదించి ‘మేము జోక్యం చేసుకోం, మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోండి’ అని చెప్పారు. అందుకే నేను ఆ బాధ్యత తీసుకున్నాను” అన్నారు. అయితే ఆయన జాతీయ అవార్డుల విధానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ “జాతీయ అవార్డుల విషయంలో పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నిర్ణయాలతో కొంతమందికి అవార్డులు లభిస్తున్నాయి. కానీ మమ్ముట్టి లాంటి గొప్ప కళాకారులకు అలాంటి అవార్డులు అవసరం లేదు. ఆయన ప్రతిభకు అవార్డులు కాదు, ప్రజల ప్రేమే నిజమైన గుర్తింపు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ అభిమానులు, నెటిజన్లు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మమ్ముట్టి ఇప్పటి వరకు మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా ఆయన చేసిన అనేక అద్భుతమైన సినిమాలు గుర్తింపు పొందలేదని అభిమానులు అప్పటినుంచే నిరాశ వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక తాజాగా కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి విభాగంలో మరోసారి విజేతగా నిలిచిన మమ్ముట్టి, రాష్ట్ర స్థాయిలో అత్యధిక సార్లు ఈ గౌరవం అందుకున్న నటుడిగా కొత్త రికార్డు సృష్టించారు.