హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి 2025 వచ్చేసింది. కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథినే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక శుద్ధ పౌర్ణమి గా పిలుస్తారు. ఈ సంవత్సరం (2025) కార్తిక పౌర్ణమి నవంబర్ 5 బుధవారం జరగనుంది. పంచాంగ గణిత ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.35 వరకు పౌర్ణిమ తిథి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో, వైష్ణవ దేవాలయాల్లో భక్తి వాతావరణం నెలకొంది. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది గా పరిగణిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం, పుణ్య స్నానం చేయడం, దీపదానం చేయడం, దైవారాధన చేయడం వలన అనేక పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొన్నాయి. సాయంత్రం వేళ భక్తులు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి, శివకేశవులను పూజిస్తారు. దీపారాధన ద్వారా అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞాన వెలుగును మన జీవితాల్లోకి తీసుకురావాలని భావిస్తారు.
కావున ఈ రోజు గంగ, గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. నదీ స్నానం సాధ్యం కాని వారు ఇంట్లోనే గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రాత్రి వెన్నెల కాంతిలో దీపాలను వెలిగించి, పరమాన్నం వండి భుజించడం కూడా ఒక ఆచారం. భక్తులు ఈ రోజున శివకేశవులను ప్రార్థిస్తూ, కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున శత్రువులపై విజయం కోసం దేవ సేనాధిపతి కార్తికేయుని స్మరించడం, సాయంత్రం ఆకాశ దీపం వెలిగించడం విశిష్టమైన ఆచారాలు. దీపదానం వలన పాపాలు నశించి, మనస్సు ప్రశాంతమవుతుందని విశ్వాసం. కాశీ, అరుణాచలం, శ్రింగేరి వంటి క్షేత్రాల్లో ఈ రోజున జరిగే దీపోత్సవాలు, జ్వాలాతోరణం దర్శనాలు భక్తులకు అపారమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
జ్వాలా తోరణం ప్రత్యేకత :
కార్తీక పౌర్ణమి సాయంత్రం ఆలయంలో జరిగే జ్వాలాతోరణం ఉత్సవం ఆధ్యాత్మిక సంప్రదాయం. ఆలయానికి ఎదురుగా కర్రలతో నిర్మించిన తోరణానికి ఎండుగడ్డి చుట్టి నిప్పు పెడతారు. ఈ అగ్ని తోరణం కిందగా శివపార్వతులను, తరువాత భక్తులను దాటిస్తారు. ఇది పాపనాశనం, శుభఫలప్రదం, దోష నివారణకు సూచకం. జ్వాలాతోరణం వెనుక పురాణ కథలు కూడా ఉన్నాయి..
త్రిపురాసుర సంహారం: పరమశివుడు త్రిపురాసురులను సంహరించిన విజయ దినం. పార్వతీదేవి దిష్టి నివారణార్థం తోరణం ఏర్పాటు చేసిందని కథ.
హాలాహల విషం తాగిన శివుడు: లోక రక్షణ కోసం విషం తాగిన తర్వాత శివుడు, పార్వతీదేవి జ్వాలాతోరణం మూడు సార్లు దాటారని విశ్వాసం.
నరక ద్వారం విముక్తి: ఈ తోరణం కిందగా దాటితే నరక ద్వారం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అందువల్ల కార్తీక పౌర్ణమి పండుగ ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం, జీవితానికి వెలుగు ఇచ్చే ఒక విశిష్టమైన రోజు. ఈ పవిత్ర సందర్భంగా భక్తులు తమ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుతూ — ప్రకాశమే జీవితం, అజ్ఞానమే చీకటి – కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు !