స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ తొలి పార్ట్ డిసెంబర్ 17న ఆడియన్స్ ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే యు ట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. తగ్గేదే లే అంటూ బన్నీ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల బాలకృష్ణ ‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అల్లు అర్జున్ భలేగా సందడి చేశాడు. బాలయ్యకు అతిథిగా బన్నీ వెళితే ఇప్పుడు బన్నీకి అతిథిగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నాడట.
హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరపబోతున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ‘బాహుబలి’ సీరీస్ తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఈ ఈవెంట్ కి రానుండటం ప్యాన్ స్టార్ గా ఎదగాలనుకుంటున్న బన్నీకి కలసి వచ్చే అంశమే. డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.