సినీనటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారని పోసానిపై ఆంధ్రప్రదేశ్ లోని ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోగినేని మణి పెట్టిన ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణమురళిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని పోసాని ఇంటికి చేరుకున్న ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పలు వైద్య పరీక్షల అనంతరం పోసానిని గురువారం రాత్రి 9 గంటలకు రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోసాని తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ ‘ బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసాని కృష్ణమురళికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల వరకు అంటే దాదాపు 7 గంటలుగా ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరువురి వాదనల అనంతరం పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో పోసాని కృష్ణమురళిని రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ రోజు నుండి మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే సెక్షన్స్ పెట్టడంతోనే పోసాని రిమాండ్ విధించారని పొన్నవోలు కామెంట్స్ చేసారు.
Also Read : NKR21 : ‘రుద్ర’గా గర్జించబోతున్న కళ్యాణ్ రామ్