ప్రముఖ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమచంద్రను ఆమె తొమ్మిదేళ్ళ క్రితం వివాహం చేసుకుంది. చక్కగా సంసార జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విశేషంగా చక్కర్లు కొట్టింది. ఎప్పుడూ లేనిది వారిద్దరి గురించి ఈ వార్త రావడంతో అంతా అవాక్కయ్యారు. అయితే అలాంటిదేమీ లేదంటూ ఇద్దరూ వివరణ ఇచ్చారు. కానీ ఎవరికి వారు దానికి వివరణ ఇవ్వడాన్ని కూడా కొందరు జీర్ణించుకోలేకపోయారు. ‘దాల్ మే కుచ్ కాలా హై’ అన్నట్టుగా వీరిద్దరి మధ్య ఏదో గొడవ నడుస్తోందంటూ కూనిరాగాలు తీశారు. ఈ రూమర్స్ కు పూర్తిగా తెరపడకముందే మరోసారి ఈ ప్రముఖ గాయని వార్తల్లోకి ఎక్కేసింది.
ఈసారి ఆమె పాడిన పాట ఒకటి వివాదానికి కేంద్ర బిందువైంది. శ్రావణ భార్గవి గొప్ప గాయని. అందులో సందేహం లేదు. ఎన్నో పాటలను అద్భుతంగా పాడింది. అలానే భక్తి గీతాలూ ఆలపించింది. తాజాగా ఆమె అన్నమయ్య రాసిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను పాడింది. అంతవరకూ బాగానే ఉంది. ఆ పాటలో ఆమే నటించడమే ఇప్పుడు పెద్ద తప్పు అయిపోయింది. ఇంటిలో క్యాజువల్ గా ఓ మహిళ ఏం చేస్తుందో అవన్నీ శ్రావణ భార్గవి ఈ వీడియోలో చేస్తూ కనిపించింది. పడుకుని పుస్తకాలు చదవడం, గార్డెన్ లో కాసేపు షికారు చేయడం, పిల్లలతో ఆడుకోవడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో ఆమె ఇటీవల పోస్ట్ చేయగానే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండు రోజుల్లో 6.5 లక్షల మంది దీనిని వీక్షించారు. అయితే అన్నమయ్య గీతానికి ఇలా అసభ్యంగా కాళ్ళూ చేతులూ ఊపుతూ నటిస్తావా? అంటూ కొందరు ఆమె మీద విరుచుకు పడటం మొదలు పెట్టారు. శ్రావణ భార్గవి వీడియోను వేర్వేరు గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేస్తూ టీటీడీ వాళ్ళు ఆమె మీద చర్య తీసుకోవాలని, అన్నమయ్య భక్తులు, వెంకన్న భక్తులు అస్సలు క్షమించకూడదని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. వీడియోకు వచ్చిన వ్యూస్ అండ్ లైక్స్ తో ఆనంద పడిన శ్రావణ భార్గవికి ఈ కామెంట్స్ కంటిలో నలుసు మాదిరి తయారయ్యాయి. దాంతో వాటిని హైడ్ చేసేసింది.
ఇదిలా ఉంటే… ”అన్నమయ్య కీర్తన ఆలపించి, దానిలో ఆమె నటిస్తే తప్పేమిటీ? పైగా ఎక్కడా ఆ వీడియోలో అసభ్యత అనేదే లేదు కదా… ఆమె మీద ఎందుకు ఇంతలా విరుచుకుపడుతున్నారు?” అంటూ కొందరు ఆమె చర్యలను సమర్థిస్తున్నారు. పలు చిత్రాలలో అన్నమయ్య కీర్తనలను దర్శకులు తమకు అనుకూలంగా చిత్రీకరించారని, అప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారుతుందో లేదా టీ కప్పులో తుఫాన్ మాదిరి చల్లబడిపోతుందో చూడాలి.