నాలుగు దశాబ్దాల పాటు రెండున్నర వేల చిత్రాలకు పోస్టర్స్ డిజైనర్ గా సేవలందించిన ఈశ్వర్ (84) చెన్నయ్‌లో కన్నుమూశారు. యుక్తవయసులోనే చెన్నయ్ చేరిన ఆయన తొలుత తన సీనియర్స్ దగ్గర పోస్టర్స్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకుని 1967లో బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ చిత్రంతో సొంత స్టూడియోను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో విడుదలైన కోడి రామకృష్ణ ‘దేవుళ్ళు’ చిత్రానికి ఆఖరుగా ఈశ్వర్ వర్క్ చేశారు. సినిమా రంగంలో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ఈశ్వర్ పలు భాషలలో భావస్పోరకమైన వేలాది పోస్టర్స్ ను రూపొందించారు. ఫోటోలతో పోస్టర్స్ తయారు చేయడం కాకుండా చిత్రకళలోని వివిధ ప్రక్రియలను అనుసరిస్తూ, అత్యద్భుతమైన పోస్టర్స్ కు జీవం పోశారు. మరీ ముఖ్యంగా నటీనటులు పోట్రేట్స్ ను గీయడంలో ఆయనకు తిరుగులేదు. పంచరంగుల పోస్టర్స్ ను రూపుదిద్దడంలో ఈశ్వర్ ప్రసిద్ధులు. ఆయన పోస్టర్స్ కోసం సినిమా రంగానికి చెందిన పలువురు దర్శక నిర్మాతలు వేచి చూసే వారంటే అతిశయోక్తి కాదు. అలానే అగ్ర కథానాయకుల చిత్రాల రీ-రిలీజ్ సమయంలోనూ తనదైన శైలిలో మూవీ పోస్టర్స్ ను తయారు చేసి, ప్రేక్షకులకు ఆ సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి ప్రధాన కారకులుగా నిలిచేవారు.
తన జీవిత విశేషాలతో పాటు, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఫిల్మ్ పోస్టర్ డిజైనర్స్ వివరాలు, సినీ రంగంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల విశేషాలతో ఈశ్వర్ 2011లో ‘సినిమా పోస్టర్’ అనే పుస్తకాన్ని రాశారు. దానికి నంది అవార్డు వచ్చింది. ఇప్పటికే ఈ పుస్తకం నాలుగు ముద్రణలు జరుపుకుంది. 2015లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈశ్వర్ ను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఈశ్వర్ సోదరుడు బ్రహ్మం అన్న ప్రోద్భలం, పోత్సాహంతో దక్షిణాది భాషల్లోని అక్షరాలను కంప్యూటీకరణకు అనుకూలంగా రాయడం విశేషం. ఇప్పుడు ప్రముఖ దినపత్రికలు వాడుతున్న ఫాంట్స్ కు ఈశ్వర్ సోదరుడు బ్రహ్మం రూపశిల్పి. ఈశ్వర్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు విజయ్ ఫిల్మ్ పోస్టర్స్ డిజైనింగ్ లో కొనసాగుతున్నాడు. ఈశ్వర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఈశ్వర్ అంత్యక్రియలు చెన్నయ్ లో జరుగనున్నాయి.