Poola Rangadu Completes 55 Years: నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును స్టార్ గా మలచడంలో ఆయన గురుతుల్యులు దుక్కిపాటి మధుసూదనరావు పాత్ర ఎంతో ఉంది. ఏయన్నార్ తో వైవిధ్యమైన పాత్రలు పోషింప చేయడానికే అన్నట్టు దుక్కిపాటి ‘అన్నపూర్ణ పిక్చర్స్’ సంస్థను నెలకొల్పి, దానికి అక్కినేనినే ఛైర్మన్ గా నియమించారు. తొలి చిత్రం ‘దొంగరాముడు’ మొదలు ఏయన్నార్ తో అనేక వైవిధ్యమైన సినిమాలు నిర్మించి, ఆయనను జనానికి మరింత చేరువ చేశారు దుక్కిపాటి. ఏయన్నార్ కు పలు సూపర్ హిట్ మూవీస్ అందించారు. 1960ల ద్వితీయార్ధం ఆరంభంలో ఏయన్నార్ వరుస పరాజయాలు చూస్తున్న సమయంలో ఆయనకు మళ్ళీ హిట్ ను అందించిందీ అన్నపూర్ణ సంస్థనే! ఎంతటి స్టార్ కైనా జయాపజయాలు తప్పవు. అలా ఏయన్నార్ నూ వరుసగా ఫ్లాపులు పలకరించాయి. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ సంస్థ అక్కినేనితో తెరకెక్కించిన ‘పూలరంగడు’ మంచి విజయం సాధించింది. 1967 నవంబర్ 24న ఈ చిత్రం విడుదలై విజయఢంకా మోగించింది.
జట్కా నడుపుతూ జీవనం సాగిస్తున్న రంగయ్యను అందరూ ‘పూలరంగడు’ అంటూ ఉంటారు. గడ్డిమోపు అమ్మే వెంకటలక్ష్మికి రంగడు అంటే ఎంతో ఇష్టం. రంగడికి ఓ చెల్లెలు పద్మ అంటే ప్రాణం. ఇక వెంకటలక్ష్మికి ఓ తమ్ముడు నరసింహులు. అతనికి పద్మ అంటే ప్రేమ. కానీ, తన చెల్లెలికి పెద్దింటి సంబంధం రావాలని రంగడు ఆశిస్తూ ఉంటాడు. నిజంగా డాక్టర్ ప్రసాద్ ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ సమయంలో నరసింహులు ఊళ్ళో ఉండడు. అతను తనకు దక్కని పద్మ వేరే వారి ఇంటికోడలు అయినందుకు ద్వేషం పెంచుకుంటాడు. వెళ్ళి ప్రసాద్ తల్లికి, పద్మ తండ్రి హత్య చేసి జైలులో ఉన్నాడని చెబుతాడు. ఆరా తీయగా, అతను హత్య చేసింది తన భర్తనే అని ఆమె తెలుసుకుంటుంది. అప్పటి నుంచీ పద్మకు కష్టాలు మొదలవుతాయి. తరువాత పద్మ పుట్టింటికి వస్తుంది. ఆ తరువాత ఆమె సామాను కూడా పంపిస్తారు. రంగడు చెల్లెలి కాపురం ఇలా చేసిన నరసింహులును చంపేయాలనుకుంటాడు. కానీ, వెంకటలక్ష్మి వచ్చి అడ్డుకొని, చేతనైతే అన్యాయం చేసిన మీ బావనే నిలదీసి అడగమని అంటుంది. దాంతో రంగడు చెల్లిని తీసుకొని బావ దగ్గరకు వెళ్ళాలనుకుంటాడు.
అప్పుడే అప్పులవాడు వచ్చి, తన అప్పు తీర్చమని బలవంత పెడతాడు. ఆలోగా పోలీసులు వచ్చి, నరసింహులును కొట్టినందుకు రంగడిని అరెస్ట్ చేస్తారు. కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. అదే జైలులో ఉన్న తన తండ్రి వీరయ్యను కలుసుకుంటాడు రంగడు. అసలు విషయం తెలుస్తుంది. ధర్మారావు, చలపతి అనేవాళ్ళు గతంలో పురుషోత్తం అనే వ్యక్తిని చంపి, డబ్బు దోచుకొని ఆ నేరం వీరయ్యపై వేసి ఉంటారు. తరువాత ధర్మారావు ధనవంతుడై ఆ ఊరిలో పెద్దమనిషిగా చెలామణీ అవుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న రంగడు విడుదలయ్యాక బయటకు వచ్చి, ఓ పథకం ప్రకారం ధర్మారావు ఇంట నౌకరుగా చేరతాడు. ఓ నాటకం ఆడి, ధర్మారవు, చలపతి ద్వారానే అసలు విషయాలు బయట పెట్టిస్తాడు. అందుకు చలపతి కొడుకు బుజ్జినీ వాడుకుంటారు. ధర్మారావు, చలపతి మాటలను రికార్డు చేస్తారు. ఆ క్యాసెట్ కోసం పలు తంటాలు పడతారు ధర్మారావు, చలపతి. చివరకు ఆ క్యాసెట్ ను కోర్టులో జడ్జి ముందు పెడతారు. ధర్మారావు తన నేరాన్ని అంగీకరిస్తాడు. అసలు విషయం తెలుసుకున్న డాక్టర్ ప్రసాద్ తన భార్య పద్మను ఆదరిస్తాడు. వీరయ్య విడుదలవుతాడు. రంగడు, వెంకటలక్ష్మి పెళ్ళితో పాటే బుజ్జి, ధర్మారావు కూతురు లిల్లీ కూడా పెళ్ళిచేసుకోవడంతో కథ ముగుస్తుంది.
ఇందులో ఏయన్నార్ జోడీగా జమున నటించగా, శోభన్ బాబు, విజయనిర్మల, గుమ్మడి, సూర్యకాంతం, పద్మనాభం, గీతాంజలి, నాగయ్య, చలం, భానుప్రకాశ్, మాలతి, అల్లు రామలింగయ్య, రాధాకుమారి, బేబీ వరలక్ష్మి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ కథ సమకూర్చగా, నిర్మాత మధుసూదనరావు సినిమా అనుకరణ రూపొందించారు. ప్రముఖ రచయిత్రి ముప్పాళ రంగనాయకమ్మ మాటలు రాశారు. కొసరాజు, సి.నారాయణ రెడ్డి, దాశరథి రాసిన పాటలకు యస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు.
ఈ చిత్రానికి ఎ.జె.క్రోనిన్ రాసిన ‘బియాండ్ దిస్ ప్లేస్’ నవల స్ఫూర్తి. కాగా, ఇందులోని “నీతికి నిలబడి నిజాయితీగా…”, “నీ జిలుగు పైట నీడలోన…”, “చిగురులు వేసిన కలలన్నీ…”, “నీవు రావు నిదుర రాదు…”, “చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే…”, “మిసమిసలాడే చినదానా…”, “సిగ్గెందుకే పిల్లా…”, “ఎయ్ రా సిన్నోడెయ్ రా…” అంటూ సాగే పాటలు భలేగా ఆకట్టుకున్నాయి. ‘పూలరంగడు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, 11 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని తరువాత తమిళంలో యమ్జీఆర్ హీరోగా ‘ఎన్ అన్నన్’ పేరుతో పా.నీలకందన్ రీమేక్ చేశారు. హిందీలో రణధీర్ కపూర్, బబిత జంటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోనే బాబూ మూవీస్ పతాకంపై ‘జీత్’ గానూ పునర్నిర్మించారు.
ఈ చిత్రంలోని జైలు సన్నివేశాలను సహజత్వం కోసం చంచల్ గూడ, ముషీరాబాద్ జైళ్ళలో చిత్రీకరించారు. ఇందులోని “చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే…” పాటను వాటిలోనే తెరకెక్కించారు. ఈ సినిమాకు కథ అందించిన ముళ్ళపూడి వెంకటరమణ మాటలు కూడా రాశారు. కానీ, వేరే వర్షన్ ను ముప్పాళ రంగనాయకమ్మతో రాయించారు దుక్కిపాటి. ఈ విషయం ముళ్ళపూడికి తెలియజేయలేదు. సినిమా టైటిల్ కార్డ్స్ లో తన పేరు కథకుడిగా మాత్రమే చూసిన ముళ్ళపూడి మనస్తాపం చెందారు. ఆ తరువాత దుక్కిపాటి చిత్రాలకు పనిచేయకూడదని ఆయన నిర్ణయించారు. దుక్కిపాటి పలు అవకాశాలు కల్పించినా, సున్నితంగా తిరస్కరించారు. 1982లో తన మిత్రుడు బాపు దర్శకత్వంలో దుక్కిపాటి ‘పెళ్ళీడు పిల్లలు’ చిత్రం నిర్మించినప్పుడు మాత్రం ఆ సినిమాకు రచన చేశారు ముళ్ళపూడి.