Ponniyan Selvan: తమిళజనాన్ని భలేగా ఊరిస్తోన్న మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగంలోని రెండో సింగిల్ శుక్రవారం సాయంత్రం విడుదలయింది. ఎ.ఆర్. రహమాన్ బాణీలకు తెలుగులో అనంత్ శ్రీరామ్ రాసిన “చోళ చోళ..” పాట మనో, అనురాగ్ కులకర్ణి గళాల్లో “కడ కడ కడవరకు..” అంటూ మొదలవుతుంది. వచ్చీ రాగానే రహమాన్ అభిమాన గణాలను ఇట్టే ఆకట్టుకుంటూ సాగింది ఈ పాట. మణిరత్నం చిత్రం అనగానే రహమాన ప్రత్యేక శ్రద్ధతో స్వరకల్పన చేస్తారు అనే అందరికీ విశ్వాసం. దానిని నిలుపుకుంటూనే రహమాన్ బాణీలు సాగాయి అనిపిస్తుంది.
“పెద పెద పులి ఎచ్చోటరా.. కూర్చోదురా.. చోళా చోళా..” అంటూ పాట ఊపందుకుంటుంది. “బెదరని పులి నెగ్గేసినా.. తగ్గేయ్ దురా.. నీలా నీలా..” అంటూ బాణీలకు తగ్గ రీతిన పదాలు పరుగు తీశాయి. కానీ, పాట వినగానే ఏదో డబ్బింగ్ మూవీలోని సాంగ్ అనిపించక మానదు. “సంధిస్తాం.. శరాలన్ని వరసగ.. సాధిస్తాం దిగంతాల వరకిక.. గర్జిస్తాం యుగాంతాన్నే భయపెడతాం..” అంటూ అనంత్ శ్రీరామ్ పలికించిన పదాల పొందిక గతంలో మణిరత్నం రూపొందించిన ‘గీతాంజలి’లో ‘జగడ జగడం..’ పాటలో వేటూరిని స్ఫురింప చేస్తుంది. బహుశా, అదే దర్శకుడు కోరిన భావాలను గీత రచయిత బాణీలకు తగ్గ పదాలతో పొందు పరిచారేమో! ఏది ఏమైనా ‘పొన్నియన్ సెల్వన్’లో మొదట విడుదలైన “పొంగే నది పాడినాది..” పాట కన్నా మిన్నగా ఈ రెండో సింగిల్ ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. తమిళ చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం కాబట్టి, దీనిపై తమిళనాట విశేషమైన ఆసక్తి నెలకొంది. తెలుగు జనాల్లోనూ ఆసక్తిని రేకెత్తించడానికి మణిరత్నం, ఎ.ఆర్.రహమాన్ కాంబో కారణమని చెప్పవచ్చు. ఇందులోని ఇతర పాటలు ఏ ముహూర్తాన జనం ముందుకు వస్తాయో కానీ, ‘చోళ చోళ..’ పాట మాత్రం భలే భలేగా ఉందనే చెప్పవచ్చు.