Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనపై ఉన్న అపోహలకు తెర దింపుతున్నారు. బరిలోకి దిగితే… ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహార శైలి. ‘పవన్ కళ్యాణ్ తో సినిమానా!? అది ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేం’ అనే పరిస్థితి ఇప్పటి వరకూ ఉన్న మాట నిజం. అయితే దానిని తోసిరాజంటూ… ఈ మధ్యే మొదలెట్టిన సినిమాను శరవేగంగా పూర్తి చేసి… త్వరితగతిన విడుదల చేయబోతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా పీపుల్స్ మీడియా సంస్థ ‘వినోదాయ సీతం’ తమిళ రీమేక్ ను ప్రారంభించింది. మాతృకకు దర్శకత్వం వహించిన సముతిర ఖనికే ఇక్కడా మెగా ఫోన్ అప్పగించారు. ఈ మూవీ షూటింగ్ యుద్థప్రాతిపదికన జరుగుతోంది. ఇంకా పేరు నిర్ణయించనప్పటికీ దీని విడుదల తేదీని ప్రకటించారు.
జూలై 28న పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ మూవీ విడుదల కాబోతోంది. గతంలో జూలై 15వ తేదీ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ మూవీ విడుదలై ఘన విజయం సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ కూడా ‘ఆన్ ద వే’ అంటూ మేకర్స్ ఊరిస్తున్నారు. బహుశా అది టైటిల్ కు సంబంధించింది కావచ్చు. ఏదేమైనా… కొత్త తెలుగు సంవత్సరాదిలో పవర్ స్టార్ అభిమానులకు పీపుల్ మీడియా అధినేత టి.జి. విశ్వప్రసాద్ సూపర్ అప్ డేట్ ఇచ్చారు. విశేషం ఏమంటే… వచ్చే నెల 21న సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. ఆ రకంగా సాయి ధరమ్ తేజ్ సైతం లైన్ లోకి వచ్చేసినట్టే! ఇక సెట్స్ పై ఉన్న ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను పూర్తి చేసి, పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలోని సినిమాకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది.