Pawan Kalyan Counter to FEFSI Rules: మన సినిమాల్లో మన వాళ్ళు మాత్రమే పని చేయాలనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నిన్న ‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాట్ టాపిక్ అయింది. పవన్ తమిళ చిత్ర పరిశ్రమకు, అక్కడి పెద్దలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయడంతో అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడారు అనే చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్యనే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కొత్త నిబంధనలు ఏర్పరచింది. తమిళ చిత్రాల్లో కేవలం తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే ఉండాలని కొత్తగా ఆదేశాలు జారీ చేయడమే కాదు వాటిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా తెలియచేసింది. ఇక ఈ అంశం మీద విమర్శలు వస్తూ ఉండడంతో ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఫెఫ్సీ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి చెబుతున్నారు.
BRO : అడ్వాన్స్ బుకింగ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో మూవీ..
ఫెఫ్సీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఈ మేరకు ఉన్నాయి.
1. తమిళ సినిమాల్లో తమిళ నటీనటులను మాత్రమే నటింపచేయాలి.
2. తమిళ సినిమాల షూటింగ్ తమిళనాడులో మాత్రమే జరపాలి.
3. షూట్ ఎంతో అవసరం అయితే తప్ప బయట రాష్ట్రంలో లేదా బయట దేశంలో చేయకూడదు.
4. షూట్ సకాలంలో పూర్తి కాకపోయినా లేదా బడ్జెట్ మించుతున్నట్టు అనిపిస్తే, తగిన కారణాలతో నిర్మాతలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి.
ఈ నిబంధనలు అతిక్రమించినట్లు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో ఈ విషయం మీద పవన్ విజ్ఞప్తి చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతోందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ తమిళ చిత్రసీమ కూడా ఆ విధంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రోజు తెలుగు చిత్రసీమగా మేము ఎదుగుతున్నామంటే, అన్ని భాషల నుంచి వచ్చిన వాళ్ళను తీసుకుంటున్నామని అన్నారు. కేరళ నుంచి వచ్చిన సుజీత్ వాసుదేవన్ (బ్రో సినిమాటోగ్రాఫర్), నార్త్ నుంచి వచ్చిన ఊర్వశి రౌతేలా (మై డియర్ మార్కండేయ స్పెషల్ సాంగ్), విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన నీతా లుల్లా (కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్)ను మేం తీసుకుంటామని ఉదాహారణలతో ఆయన చెప్పుకొచ్చారు. . అన్ని భాషలు, అన్ని కలయికలు ఉంటే సినిమా అవుతుంది తప్ప, కేవలం మన భాష వాళ్ళు మాత్రమే ఉండాలని అంటే కుంచించుకుపోతాం అని అన్నారు.
అటువంటి చిన్న స్వభావం నుంచి బయటకు వచ్చి, మరింత విస్తృత పరిధిలో ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తీయాలని, ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ప్రాంతం, కులం, మతం వంటి పరిధులు దాటాలని ఆకాంక్షించిన ఆయన తమిళ చిత్ర పరిశ్రమ పెద్దది కావడానికి కారణం ఏఎం రత్నం అని, ఆయన తెలుగు వాడని పవన్ కళ్యాణ్ వివరించారు. ఒకవేళ తమిళనాడులో స్థానిక కార్మికులకు సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించాలని, వాళ్ళకు ఉపాధి దొరకాలని, పరిష్కారం కోసం మరో ఉపాయం ఆలోచించాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. ఇక ఈ ఫెఫ్సీ అధ్యక్ష్యుడు టాలీవుడ్ హీరోయిన్ రోజా భర్త కావడంతో ఆయనకు కౌంటర్ ఇచ్చారనే కామెంట్లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి.