మ్యాచో హీరో గోపీచంద్, హాట్ బ్యూటీ రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ – UV క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా నేడు గోపీచంద్ బర్త్ డే ను పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించి మారుతి మార్క్ ను గుర్తుచేసింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే .. డబ్బుకోసం ఎలాంటి కేసును అయినా ఒప్పుకొని, నిందితులను నిర్దోషులుగా బయటికి తీసుకురాగల సత్తా ఉన్న యువకుడు గోపీచంద్.. ఇక అతడి తండ్రి సత్యరాజ్ నీతి, నిజాయితీ గల మాజీ జడ్జి.. వీరిద్దరికి కొంచెం కూడా పడదు. అలాంటి వీరి జీవితంలోకి అనూహ్యంగా సినిమా పిచ్చి గల రాశీ ఖన్నా ఎంటర్ అవుతుంది. ఆ తరువాత ఒక కేసు విషయమై గోపీచంద్ కు, సత్యరాజ్ కు మధ్య యుద్ధం మొదలవుతుంది.
ధర్మం కోసం కొడుకుకు విరుద్ధంగా తండ్రి యుద్ధం మొదలుపెడతాడు. మరి వీరిద్దరిలో గెలిచేది ఎవరు..? అస్సలు ఆ కేసు ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ మొత్తం వినోదంతో నింపేసిన మారుతి నిజంగానే సినిమా పక్కా కమర్షియల్ అని చూపించాడు. కోర్ట్ రూమ్ డ్రామా.. లాయర్ల నేపథ్యం.. రాశీ ఖన్నా గ్లామరస్ ట్రీట్ తో ట్రైలర్ కలర్ ఫుల్ గా కనిపించడమే కాకుండా భారీ అంచనాలను పెంచేసింది. ఇక సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోను కాదురా .. విలన్ అని గోపీచంద్ డైలాగ్ ఆకట్టుకొంటుంది. గోపీచంద్-రాశి ఖన్నాల కామెడీ టైమింగ్.. రావు రమేష్ అసాధారణమైన క్యారెక్టరైజేషన్ ఆసక్తి రేపుతోంది. ఏదిఏమైనా ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు. మరి ఈ సినిమాతో గోపీచంద్ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.