భారతదేశంలో బెంగాలీ సాహిత్యం ఇతర ప్రాంతాలపైనా విశేషమైన ప్రభావం చూపింది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తన బెంగాలీ, ఆంగ్ల రచనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను అలరించారు. ఆ రోజుల్లో ఆయనకు ఎనలేని అభిమానగణాలు ఉండేవి. అంతటి రవీంద్రనాథుడు తనను కట్టిపడేసే రచనలు చేసిన రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ అని సెలవిచ్చారు. శరత్ చంద్రుడు కూడా వంగదేశ రచయితనే. రవీంద్రుని కంటే వయసులో 15 ఏళ్ళు చిన్నవాడు. అయినా రవీంద్రుని, శరత్ బాబు రచనలు అమితంగా ఆకర్షించాయంటే వాటిలోని సత్తా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తన చుట్టూ జరిగే సంఘటనలను పరిశీలించి కథలను రాయడం శరత్ బాబు బాణీ! ముఖ్యంగా తన స్నేహితుల కథలనే ఆయన రాశారని చెబుతారు. ఆయన రాసిన కథల్లో ‘దేవదాసు’ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకంటే మంచి కథలను సైతం శరత్ బాబు రాసినా, సినిమా వారిని అమితంగా ఆకర్షించింది ‘దేవదాసు’ కథనే! జూలై 12న సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ ‘దేవదాస్’గా నటించిన చిత్రం విడుదలై 20 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా శరత్ బాబు ‘దేవదాసు’ చిత్రసీమలో ఎంతటి ప్రభావం చూపించిందో గుర్తు చేసుకుందాం.
‘దేవదాసు’ కథతో తొలిసారి 1928లో దర్శకుడు నరేశ్ సి.మిత్ర ఓ మూకీ రూపొందించారు. ఇందులో ఫణి బర్మా దేవదాసుగా నటించారు. ఆ తరువాత 1935లో దర్శకనిర్మాత పి.సి.బారువా తానే నటించి ‘దేవదాస్’ చిత్రాన్ని బెంగాల్ లో రూపొందించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. 1936లో హిందీలోనూ ఆ కథను నటగాయకుడు కె.ఎల్.సైగల్ ‘దేవదాసు’గా తెరకెక్కించారు బారువా. ఈ చిత్రమూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహంతోనే బారువా 1937లో అస్సామీలో ఫణిశర్మ దేవదాసుగా చిత్రం నిర్మించారు. ఆ కథతో వినోదా సంస్థ అక్కినేని ‘దేవదాసు’గా 1953లో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు నిర్మించి, విజయం సాధించింది. శరత్ బాబు రాసిన కథనే ప్రధానంగా తీసుకున్నా, కొన్ని మార్పులూ చేర్పులూ చేస్తూ చిత్రాలు రూపొందాయి. అయితే 1955లో బిమల్ రాయ్, దిలీప్ కుమార్ ‘దేవదాస్’గా హిందీ చిత్రం రూపొందించారు. ‘దేవదాస్’ కథలోని అసలైన ఆత్మను బిమల్ రాయ్ చిత్రమే ప్రతిబింబింప చేసిందని విమర్శకులు ప్రశంసించారు. 1965లో ఖ్వాజా సర్ఫరాజ్ దర్శకునిగా, హబీబ్ తలాష్ దేవదాసు పాత్రలో ఉర్దూ చిత్రం రూపొందింది. 1974లో కృష్ణతో విజయనిర్మల నాయికగా నటిస్తూ దర్శకత్వం వహించి, ఈస్ట్ మన్ కలర్ – సినిమా స్కోప్ లో ‘దేవదాసు’ తెరకెక్కించారు.
తరువాత 1979లో బెంగాలీలో సౌమిత్ర ఛటర్జీ ‘దేవదాసు’గా దిలీప్ రాయ్ మరో దేవదాసును రూపొందించారు. 1982లో బుల్ బుల్ అహ్మద్ హీరోగా బెంగాలీలోనే మరో ‘దేవదాసు’ తెరకెక్కింది. వేణు నాగవల్లి హీరోగా మళయాళంలో 1989లో ఓ ‘దేవదాసు’ వచ్చింది. 2002లో సంజయ్ లీలా భన్సాలీ, షారుఖ్ ఖాన్ హీరోగా హిందీలో ‘దేవదాస్’ తెరకెక్కిస్తున్న సమయంలోనే ప్రముఖ దర్శకుడు శక్తి సామంత బెంగాలీలో ‘దేవదాస్’ను రూపొందించారు. భన్సాలీ ‘దేవదాస్’గా షారుఖ్ ఆకట్టుకున్నారు. కాగా, శక్తి సామంత ‘దేవదాస్’ పేలవంగా రూపొందింది, అందులో ప్రసేన్ జిత్ ఛటర్జీ టైటిల్ రోల్ పోషించారు.
తరువాత 2009లో అనురాగ్ కశ్యప్ ఇదే ఇతివృత్తాన్ని సుఖాంతం చేస్తూ ‘దేవ్-డి’గా రూపొందించి, అలరించారు. 2010లో ఉర్దూలో మరోమారు ‘దేవదాస్’ తెరకెక్కింది. 2013లో షాఖిబ్ ఖాన్ ‘దేవదాసు’గా మరో బెంగాలీ చిత్రం వెలుగు చూసింది. 2018లో ‘దాస్ దేవ్’ అనే హిందీ చిత్రం సైతం శరత్ బాబు కథను ఆధారం చేసుకొనే పలు మార్పులతో రూపొందింది. ఇలా శరత్ బాబు అసలు కథకే అనేక మార్పులతో తెరపై పలు మార్లు దేవదాసు ప్రత్యక్షమయ్యాడు. ఓ సాంఘిక కథను ఇన్నిసార్లు రీమేక్ చేయడం అన్నది భారతదేశంలో ‘దేవదాసు’కు మాత్రమే సాధ్యమయింది.
‘దేవదాసు’ కథ స్ఫూర్తితో తరువాత పలు చిత్రాలు రూపొందాయి. దేవదాసు, పార్వతి లాగా చిన్నప్పటి స్నేహితులు పెద్దయ్యాక కలుసుకోవడం, తరువాత వారి ప్రేమ ఫలించక పోవడం వంటి కథలతో పలు చిత్రాలు వచ్చాయి. అలాగే ‘దేవదాసు’లోని చంద్రముఖి పాత్రను పోలిన వాటితోనూ కొన్ని సినిమాలు రూపొందాయి. గురుదత్ ‘ప్యాసా’లో వహిదారెహమాన్ పోషించిన వేశ్య గులాబ్ పాత్రను చూస్తే చంద్రముఖి పాత్ర గుర్తుకు రాకమానదు. అలాగే ‘ముఖద్దర్ కా సికందర్’లో రేఖ పాత్ర సైతం చంద్రను తలపిస్తుంది. 1981లో ఏయన్నార్ తో దాసరి తెరకెక్కించిన ‘ప్రేమాభిషేకం’లోనూ జయసుధ పాత్ర చంద్రముఖినే గుర్తు చేస్తుంది.
‘దేవదాసు’ కథలో దేవదాసు చనిపోతాడు. అతను మళ్ళీ పుట్టినట్టుగా కథను రూపొందించి దాసరి నారాయణరావు ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ అనే చిత్రాన్ని 1978లో తెరకెక్కించారు. ఇందులో 1953లో దేవదాసుగా నటించిన ఏయన్నార్, పార్వతిగా కనిపించిన సావిత్రి మళ్ళీ నటించడం విశేషం! కాగా, అసలు ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కారణం, ‘దేవదాసు’ కథలో దేవదాసును చంద్రముఖి ప్రేమిస్తుంది. ఆమెతో ‘మళ్ళీ జన్మే ఉంటే నీ కోసం పుడతాను అమ్మీ’ అంటాడు దేవదాసు. ఆ పాయింట్ ను ఆధారం చేసుకొని దాసరి ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ తెరకెక్కించారు. ఇందులో చంద్రముఖి కూడా మళ్ళీ జన్మించి ఉంటుంది. ఆ పాత్రలో వాణిశ్రీ నటించారు.
జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, 2017లో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ కూడా దేవదాసు నడకలోనే సాగుతుంది. ఇందులో నాయికానాయకులు మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్స్ గా కలుసుకుంటారు. ప్రేమించుకోవడం, పెళ్ళి చేసుకోవాలనుకోవడం, చిన్న మాట పట్టింపుతో విడిపోవడం సాగుతాయి. దేవదాసుకు ఓ మిత్రుడు ఉంటాడు. అదే తీరున ఇందులోనూ అర్జున్ రెడ్డి బాగు కోరే స్నేహితుడు కనిపిస్తాడు. ప్రేమవిఫలమై దేవదాసులాగే అర్జున్ రెడ్డి కూడా తాగుబోతుగా మారడం, చివరకు మత్తు కోసం చీప్ లిక్కర్ తాగే దశకు చేరుకోవడం, ఓ కుక్క కూడా అతనితో ఉండడం అన్నీ దేవదాసును గుర్తు చేస్తాయి. అయితే ఇందులో హీరో మళ్ళీ ప్రేయసిని కలుసుకోవడం, ఆమెను పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ప్రేమకథలు ‘దేవదాసు’ను ఆధారం చేసుకొని తెరకెక్కుతూనే ఉన్నాయి. కొందరు శరత్ బాబు ‘దేవదాసు’నే తీసుకొని సినిమాలు తెరకెక్కించారు. మరికొందరు ఆ కథను స్ఫూర్తిగా గ్రహించారు. భవిష్యత్ లోనూ ‘దేవదాసు’ కథ మరిన్ని చిత్రాలకు ఆధారం అవుతుందని చెప్పవచ్చు.