NTR: ‘తమ నందమూరి నటవంశంలో ఎక్కువ ప్రయోగాలు చేసింది తన అన్న కళ్యాణ్ రామ్ ఒక్కరే’ అంటూ ఇటీవల ‘అమిగోస్’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ యన్టీఆర్ వ్యాఖ్యానించడం పలు విమర్శలకు దారి తీసింది. నిజానికి నందమూరి నటవంశానికి మూలపురుషుడైన నటరత్న యన్టీఆర్ చేసినన్ని ప్రయోగాలు బహుశా ప్రపంచంలోనే ఏ నటుడూ చేసి ఉండరు. ఆ తరువాత ఆయన వారసత్వాన్ని నిలుపుతూ బాలకృష్ణ సైతం తండ్రిలాగే పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక, సైంటిఫిక్ ఫిక్షన్ లో నటించి ఆకట్టుకున్నారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఏ స్టార్ హీరో కూడా బాలకృష్ణ లాగా ప్రయోగాలు చేసింది లేదు. ఈ విషయాన్ని ఆయన తరం టాప్ స్టార్స్ సైతం అంగీకరిస్తారు. అలాంటిది తమ నటవంశంలో కళ్యాణ్ రామ్ లాగా ఎవరూ లేరని జూనియర్ చెప్పడం నిజంగా విడ్డూరమే. సోలో హీరోగా ‘అరవింద సమేత’ తరువాత ఇప్పటికీ ఒక్క సినిమాను కూడా పట్టాలెక్కించలేక పోయిన జూనియర్ మాటలను కూడా సీరియస్ గా తీసుకుంటే ఎలా అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ విషయం అలా ఉంచితే, జనం మదిలో పెద్దాయనగా నిలచిన నటరత్న ఎన్నెన్నో ప్రయోగాలు చేయడమే కాదు, తన చిత్రాల విడుదల విషయంలోనూ నిర్మాతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. అలా ఒకే రోజున ఆయన నటించిన రెండు చిత్రాలు విడుదలయిన సందర్భాలూ ఉన్నాయి. 1961లో యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘సతీ సులోచన’, ‘పెండ్లిపిలుపు’ చిత్రాలు మే 5వ తేదీన విడుదలై, రెండూ శతదినోత్సవం జరుపుకోవడం విశేషం! అదే తీరున బాలయ్య 1993లో తాను నటించిన ‘బంగారు బుల్లోడు, నిప్పురవ్వ’ చిత్రాలను సెప్టెంబర్ 3న విడుదల చేసి ఘనవిజయం సాధించిన సందర్భమూ ఉంది. అలాంటి ఘనచరిత గల నందమూరి సీనియర్స్ ను జూనియర్ మరచిపోయి, తమ తరం హీరోలే మిన్న అని చెప్పడం విడ్డూరమే. ఇక 60 ఏళ్ళ క్రితం ఫిబ్రవరి మాసంలో కేవలం 16 రోజుల వ్యవధిలో యన్టీఆర్ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ నెల 6వ తేదీన ‘పెంపుడు కూతురు’, మూడు రోజులకే అంటే 9వ తేదీన ‘వాల్మీకి’ చిత్రాలు వెలుగుచూశాయి. ఆ పై అదే నెల 22వ తేదీన యన్టీఆర్ ‘సవతి కొడుకు’ విడులయింది. ఈ మూడు చిత్రాలలోనూ యన్టీఆర్ విలక్షణమైన పాత్రలు పోషించారు. ఇలాంటి విషయాలను జూనియర్ కు చెప్పే వారేరి?
‘పెంపుడు కూతురు’లో యన్టీఆర్ పోషించిన పాత్రను ఈ రోజుల్లో ఏ స్టార్ హీరో అయినా ధరించాలంటే జంకుతారు. అప్పటికే సూపర్ స్టార్ గా సాగుతున్న రామారావు, ఇందులో తన తండ్రి పెంచిన కూతురు సంపాదనపై సాగుతూ, రోజూ పేకాట ఆడుకుంటూ ఉండే పాత్రలో విలక్షణంగా కనిపిస్తారు. ఆ పెంపుడు చెల్లి ఓ కలవారి కోడలుగా వెళ్తుంది. ఆమె భర్త సోదరి, ఇతణ్ణి చూసి అసహ్యించుకుంటూ ఉంటుంది. అలాంటి ఆమెకు ఇతని కారణంగానే కళ్ళు పోతాయి. దాంతో ఆమెను ఇతనే పెళ్ళి చేసుకుంటాడు. నిజం తెలిసిన ఆ అభిమానవతి తూలనాడి గెంటేస్తుంది. తరువాత అతను భార్య ప్రేమను ఎలా పొందగలిగాడు? అన్నఅంశంతో కథ సాగుతుంది. బి.ఆర్. పంతులు దర్శకత్వంలో పద్మినీ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి టి.జి.లింగప్ప సంగీతం సమకూర్చారు.
‘వాల్మీకి’ విషయానికి వస్తే, ‘లవకుశ’ రాకముందే ఈ సినిమా వెలుగు చూడడం, అందులో యన్టీఆర్ నటనకు జనం జేజేలు పలకడం జరిగాయి. అడవిదొంగగా జీవితం సాగించే కరకు బోయడిని, కవిగా మార్చే క్రమంలో సాగిన వైష్ణవ లీలతో ‘వాల్మీకి’ రూపొందింది. ఇందులో రామారావు వాల్మీకి జీవితంలో పలు దశలను, వాటి పరిణామానికి అనువుగా అభినయం ప్రదర్శిస్తూ ఒకే పాత్రలో వైవిధ్యం చూపిన తీరును ఎవరూ మరచిపోలేరు. సి.యస్.రావు దర్శకత్వంలో జూపిటర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.కె.హబీబుల్లా నిర్మించిన ఈ చిత్రానికి ఘంటసాల సంగీతంలో రూపొందిన పాటలు భలేగా అలరించాయి.
‘సవతి కొడుకు’ టైటిల్ ను బట్టే, కన్నతల్లి లేని సవతి కొడుకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. సవతి తల్లిని సైతం ఎలా చేరదీశాడు అన్న కథతో ఈ సినిమా సాగుతుంది. వై. రంగారావు దర్శకత్వంలో నవీన చిత్ర ఈ చిత్రాన్ని నిర్మించింది. తరువాతి రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకునిగా రాణించిన సత్యం ఈ సినిమాతోనే స్వరకల్పన చేస్తూ పరిచయం అయ్యారు.
ఇలా అరవై ఏళ్ళ క్రితమే యన్టీఆర్ ఇవే కాదు మరెన్నో ప్రయోగాలకు నెలవయ్యారు. అలాంటి మహానటుని వారసులమని మొన్నటి దాకా చెప్పుకున్నవారు, ఇప్పుడు యన్టీఆర్ శతజయంతి సాగే సందర్భంలో ఆయన ఘనతనే విస్మరించి, తమదే గొప్పని చెప్పుకోవడం విడ్డూరమే. అభిమానులకు అది విచారం కలిగించే అంశమే!