ఏప్రిల్ 11వ తేదీకి ఎన్టీయార్ వెండితెర నటుడిగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్నాడు. చిత్రం ఏమంటే సిల్వర్ స్క్రీన్ పైకి రావడమే రాముడి పాత్రతో వచ్చాడు ఎన్టీయార్. ఆయన తాతయ్య నటరత్న ఎన్టీయార్ సైతం రాముడి పాత్రలతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం పొందారు. ఈ బాల రాముడు సైతం అందరితోనూ భళా అనిపించుకున్నాడు. చిన్నప్పటి నుండి శాస్త్రీయ నృత్యాన్ని సైతం నేర్చుకున్న ఎన్టీయార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా కొన్ని సినిమాలలో పౌరాణిక పాత్రల్లో మెరుపులా మెరిసి మెప్పించాడు.
విశేషం ఏమంటే… ఇటీవలే పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’తో తన పరిధిని మరింత విస్తరించుకున్నాడు ఎన్టీయార్. అంతేకాదు.. తొలిసారి తనకు సరిజోడీ అయిన రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ లో నటించాడు. బహుశా ఈ సినీ ప్రయాణం కారణంగానే కావచ్చు… ఎన్టీయార్ ఇప్పుడు భక్తి మార్గం పట్టాడు. బుధవారం నుండి 21 రోజుల పాటు ఆంజనేయ స్వామి దీక్ష చేపట్టబోతున్నాడు ఎన్టీయార్. ఇలాంటి దీక్షలు పట్టడం ఎంతో కాలంగా రామ్ చరణ్ కు అలవాటు. కానీ ఎన్టీయార్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడని సన్నిహితులు చెబుతుంటారు. బహుశా ‘ట్రిపుల్ ఆర్’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కావచ్చు… ఎన్టీయార్ ఈ దీక్షకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. సో… ఇరవై ఒక్క రోజుల పాటు మనం సరికొత్త ఎన్టీయార్ చూస్తామన్న మాట!