JR NTR: ఆస్కార్ నామినేషన్స్ అనౌన్స్ మెంట్ తేదీ దగ్గర పడే కొద్దీ సినీబఫ్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. మరో నాలుగు రోజుల్లో ఆస్కార్ నామినేషన్స్ ప్రకటిస్తారు. ప్రపంచంలోని నలుమూలల ఉన్న భారతీయుల్లో ఈ దఫా ఆస్కార్ నామినేషన్స్‌పై ఆసక్తి రెట్టింపు అవుతోంది. రేసులో మన తెలుగు చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ పలు కేటగిరీల్లో పోటీకి సిద్ధం కావడమే మనవాళ్ళలో ఇంట్రెస్ట్ పెరగడానికి కారణమయింది. అమెరికాకు చెందిన ‘యుఎస్ఏ టుడే’ పత్రిక పదిమంది నటులను తప్పకుండా ఆస్కార్ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఓ ఐటమ్ ప్రచురించింది. ఇందులో ఐదుమంది నటులు, ఐదుమంది నటీమణులు ఉన్నారు. ఈ జాబితాలో ‘ట్రిపుల్ ఆర్’లో తన నటనకు గాను జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చోటు చేసుకుంది. దాంతో మన తెలుగు సినీ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది.
Read Also: ICC: సైబర్ నేరగాడి వలలో ఐసీసీ.. 10 మిలియన్ డాలర్లు హాంఫట్
ఇంతకూ జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ‘యుఎస్ఏ టుడే’ మేగజైన్ ప్రకటించిన ఉత్తమ నటుల కేటగిరీలో ఎవరున్నారంటే – ‘టాప్ గన్ : మేవరిక్’ ద్వారా ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, ‘ద బ్యాట్ మేన్’ సినిమా ద్వారా పాల్ డేనో, ‘ఆఫ్టర్ సన్’ మూవీతో పాల్ మెస్కల్, ‘ది ఇన్ స్పెక్షన్’ తో జెరేమీ పోప్ ఉన్నారు. కాగా, నటీమణుల జాబితాలో ‘యుఎస్ఏ టుడే’ పేర్కొన్నవారు – మియా గోత్ (పెరల్), నినా హాజ్ (టార్), జో క్రేవిట్జ్ (కిమి), లషనా లించ్ (ద ఉమన్ కింగ్, మెటిల్డా ద మ్యూజికల్), కెకె పామర్ (నోప్) చోటు సంపాదించారు.
మరి ఈ పదిమందిలో ఎంతమంది ఆస్కార్ నామినేషన్స్ సంపాదిస్తారో కానీ, ‘యుఎస్ఏ టుడే’తో పాటు మరికొన్ని పత్రికలు సైతం తమ సర్వేలో ఈ పేర్లనే ప్రస్తావించడం గమనార్హం. ఇప్పటికే ఓటింగ్ ద్వారా రాజమౌళి పేరును కొన్ని అమెరికా మేగజైన్స్ ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో చొప్పించాయి. అదే తీరున ‘యుఎస్ఏ టుడే’ పేర్కొన్న ‘బెస్ట్ యాక్టర్’ జాబితాలో మన జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉంది. ఇలా రోజు రోజుకూ ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌పై ఆశలు పెంచుతోంది. జనవరి 25వ తేదీ తెల్లవారు జామున (భారత కాలమానం ప్రకారం) ప్రకటించే ఆస్కార్ నామినేషన్స్‌లో ‘ట్రిపుల్ ఆర్’ నుండి మన రాజమౌళి, జూ.ఎన్టీఆర్‌కు చోటు దక్కాలని కోరుకుందాం.