Bekkem Venu:’టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. “సత్యభామ, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు” వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు పొందిన బెక్కెం వేణుగోపాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. ఏప్రిల్ 27న పుట్టిన రోజును పురస్కరించుకుని బెక్కెం వేణుగోపాల్ తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. తన తొలి అడుగులను గుర్తు చేసుకుంటూ, “2006 అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలై విజయవంతమైంది. అక్కడి నుంచి 16 సంవత్సరాలు గడిచిపోయింది. సినిమా తప్ప వేరే వ్యాపకం, బిజినెస్ నాకు లేదు. సినిమా తరువాత సినిమా చేస్తూ వచ్చాను. నిర్మాతగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. డబ్బుల గురించి చెప్పను కానీ అంతకంటే విలువైన అనుభవం సంపాందించాను. నిర్మాతగా ప్రతి సినిమాను ఇష్టంగా నిర్మించాను. సూపర్‌స్టార్ కృష్ణగారి సినిమా షూటింగ్ చూద్దామని వచ్చిన నేను ఈ రోజు నిర్మాతగా ఎదగడం, నాకు ఇష్టమైన సినిమా రంగంలో ఉండటం ఎంతో తృప్తిని కలిగిస్తోంది” అన్నారు.
ఇటీవల విడుదలైన తాజా చిత్రం ‘అల్లూరి’ గురించి చెబుతూ, “మా సినిమాకు విడుదల సమయంలో జరిగింది కాకుండా వేరే విషయాలు మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికీ హీరో శ్రీవిష్ణుతో నాకు మంచి రిలేషన్ వుంది. ఈ విషయంలో నేను మాట్లాడటం కంటే శ్రీవిష్ణు మాట్లాడితేనే బాగుంటుంది. నిజానికి ఆ సినిమా విడుదల కూడా ఎక్కడా ఆగలేదు. మార్నింగ్ షో కాస్త ఆలస్యంగా పడింది. అంతే తప్ప అంతకు మించి ఏమీ జరగలేదు. ప్రతి సినిమాకు జరిగే గొడవలే! ఆ సినిమాకు జరిగిన అనుభవాలు నాకు పాఠాలు నేర్పాయి. సినిమా ఇష్టంగా చేశాను. అది గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ బ్యాడ్ సినిమా కాదు” అని అన్నారు. ‘దిల్’ రాజుతో అనుబంధం గురించి వివరిస్తూ, “మా జర్నీకి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాను. ‘దిల్’ రాజు సపోర్ట్ నాకు ఎప్పుడూ వుంటుంది. ఆయన జడ్జిమెంట్‌పై నాకు ఎంతో నమ్మకం” అని తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తూ, “కొత్తవాళ్లతో ‘రోటి, కపడా, రొమాన్స్’ అనే సినిమాతో పాటు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి సుడిగాలి సుధీర్‌తో ఓ మూవీ చేస్తున్నాను. ‘పాగల్’ ఫేమ్ నరేశ్ కుప్పిలి దీనికి దర్శకుడు. వీటితో పాటు ఓటీటీ కోసం అవికాగోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓ క్రేజీ థ్రిల్లర్ చేస్తున్నాం” అని అన్నారు.
ఇవాళ్టి నిర్మాతల పరిస్థితి చెబుతూ, “నిర్మాతది ఎప్పుడూ క్లిష్ట పరిస్థితే. సినిమా మీద నాలెడ్జ్ వున్న వాళ్లు, అనుభవం వున్నవాళ్ళు తీసిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ. అనుభవంతో పాటు సినిమా మీద అంకితభావం వుండాలి. అప్పుడే నిర్మాతగా సక్సెస్ సాధిస్తారు. అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కథ కంటే కాంబినేషన్ నమ్ముకుని ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. దాని వల్ల సినిమా సూపర్‌హిట్ అయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్ నమ్ముకుని పారితోషికాలు పెంచేయడం వల్ల సినిమా బడ్జెట్ కూడా ఊహించని స్థాయికి చేరుకుంటుంది” అని అన్నారు. తనకు నటన, దర్శకత్వం మీద ఆసక్తి లేదని చెబుతూ, “పబ్లిసిటి కోసం ఎన్ని యాక్టింగ్‌లైనా చేస్తాను. అంతే తప్ప సినిమాల్లో నటించలేను. నిజం చెప్పాలంటే నిర్మాతలకు మించిన నటుడు ఎవరు వుండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా వుండాల్సిన పరిస్థితి” అని ఆవేదన వ్యక్తం చేశారు.