సుధీర్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘శాకిని డాకిని’. సౌత్ కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ కు ఇది రీమేక్. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇదే నెల 16న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో హీరోయిన్లు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ తో పాటు నిర్మాతలలో ఒకరైన సునీత తాటి పాల్గొన్నారు.
తొలుత రెజీనా కసాండ్రా మాట్లాడుతూ, ”ఈ సినిమా నా కెరియర్ లో ఒక మైలు రాయి. ఇందులో యాక్షన్, కామెడీతో పాటు సమాజానికి మంచి సందేశం వుంటుంది. కథానాయకులుగా ఇద్దరు హీరోయిన్స్ వుండటం ఖచ్చితంగా కొత్తగా వుంది. మాపై నమ్మకంతో ఈ సినిమా చేసిన సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు. ‘కదిలే కదిలే’ పాట ఈ సినిమా కథకి అద్దం పడుతుంది. ఈ పాట చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహిళలు ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకం వుంది” అని అన్నారు.
నివేదా థామస్ మాట్లాడుతూ, ”’బ్రోచేవారెవరు’ సినిమా సమయంలో సురేష్ బాబుగారు పరిచయమయ్యారు. సినిమా గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ యూనిక్ సినిమాలకు పెట్టింది పేరు. ‘శాకిని డాకిని’ కథా చర్చల్లో పాల్గొన్నప్పుడే పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. అలాగే థీమ్ సాంగ్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘శాకిని డాకిని’ కెమిస్ట్రీ ఈ థీమ్ సాంగ్ లో చూశారు. ఇందులో నేను, రెజీనా చాలా డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాం. చిరాకుతో కూడిన ఫన్ రిలేషన్ అది. ఈ మూవీని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో చూడాలి” అని కోరారు.
నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ, ”ఏ సినిమా చేయడానికి అయినా నాకు మూడు ముఖ్యమైన ఎలిమెంట్స్ ఉండాలి. కథ, నటీనటులు, కథని ఎందుకు చేస్తున్నామనే స్ఫూర్తి. ‘శాకిని డాకిని’లో ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్ ని డీల్ చేస్తారనేది కథ. ఈ కథ మొదటి నుండి మాకు చాలా నచ్చింది. ఒక ఆడపిల్ల పుడితే ఆమె మొదటి పాత్ర కూతురు. అలాంటి ఒక కూతురిని దగ్గర పెట్టుకొని కొన్ని సినిమాలు చూడలేకపోతున్నాం. కానీ ఈ సినిమాలో అలాంటి కూతురు దగ్గర వున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. సురేష్ బాబుగారి సహకారంతో ఈ సినిమాని చేశాం. సినిమాలో నివేదా పంచ్ లు, రెజీనా కిక్కులు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. సినిమాని ఇంటర్ నేషనల్ స్థాయిలో ఎక్కడా రాజీపడకుండా తీశాం. రెజీనా, నివేదా చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ కు దర్శకుడు సుధీర్ వర్మ దూరంగా ఉండటంపై సునీత తాటి వివరణ ఇచ్చారు. ‘ఈ సినిమాను తాము జనవరి 2020లో మొదలు పెట్టామని, మధ్యలో కొవిడ్ కారణంగా కొంత గ్యాప్ వచ్చిందని, అయితే ఆ తర్వాత సుధీర్ వర్మ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యార’ని అన్నారు. ‘ఈ సినిమాను సుధీర్ వర్మ ఎంతో కమిట్ మెంట్ తో తెరకెక్కించారని, కొంత ప్యాచ్ వర్క్స్ ను ఆయన సూచించిన వ్యక్తితోనే తాము పూర్తి చేశామ’ని అన్నారు. ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్న సుధీర్ వర్మను సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే, ప్రమోషన్ కు హాజరు కావాలని తాము ఒత్తిడి చేయడం లేద’ని సునీత తెలిపారు.