ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది.
1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే నిత్య మీనన్ బాల్యంలోనే ‘ద మంకీ హూ న్యూ టూ మచ్’ అనే ఆంగ్ల చిత్రంలో ప్రముఖ నటి టబుకు చెల్లెలుగా నటించింది. కన్నడ, మళయాళ భాషల్లో నటిస్తున్న సమయంలోనే ఆమె నటనను చూసి మురిసిపోయింది దర్శకురాలు నందినీ రెడ్డి. తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’తోనే నిత్య మీనన్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది నందినీ రెడ్డి. ఆ తరువాత నుంచీ తన టాలెంట్ తో తెలుగువారిని ఇట్టే కట్టి పడేసింది నిత్య.
‘అలా మొదలైంది’ చిత్రంలోనే నిత్య మీనన్ రెండు పాటలు పాడేసి, అబ్బుర పరచింది. కళ్యాణీ మాలిక్ స్వరకల్పనలో “ఏదో అనుకుంటే…”, “అమ్మమ్మో అమ్మో…” అంటూ సాగే పాటలను పాడి నిత్య గాయనిగానూ పరవశింప చేసింది. ముద్దుగా బొద్దుగా ఉంటూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో నిత్య తెలుగువారికి దగ్గరయింది. హీరో నానికి ‘అలా మొదలైంది’తో కలసి వచ్చింది నిత్య మీనన్. ఇక సక్సెస్ కోసం చెకోర పక్షిలా హీరో నితిన్ ఎదురు చూస్తున్న సమయంలో ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాల్లో నటించి, అతనికి విజయనాయికగా మారింది నిత్య. అంతేనా, ఆ రెండు సినిమాల్లోనూ గాయనిగా అలరించింది. ‘ఇష్క్’లో నిత్య నోట పలికిన “ప్రియా ప్రియా…” పాట ఇప్పటికీ కుర్రకారును కవ్విస్తూనే ఉంది. ఇక “తూ హీ రే…” అంటూ పాట పాడి ‘గుండె జారి గల్లంతయ్యిందే’లోనూ మురిపించింది. తాను నటించిన ’24’, ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్’, ‘మాలిని 22’ వంటి డబ్బింగ్ చిత్రాలలోనూ తెలుగు పాటలు పాడి అలరించింది నిత్య మీనన్. ఇప్పటికీ తన దరికి చేరిన తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తూనే ఉంది నిత్య. ‘స్కైలాబ్’ తెలుగు చిత్ర నిర్మాణంలో నిత్య మీనన్ పాలు పంచుకుంది. ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమం న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారామె. మునుముందు తెలుగుతో మరెంతగా అనుబంధం పెంచుకుంటుందో నిత్య మీనన్!