‘రాజావారు రాణి గారు’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయం సాధించింది. అయితే ఆపైన విడుదలైన ‘సెబాస్టియన్, సమ్మతమే’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. చిత్రం ఏమంటే… ఈ సినిమాల విడుదలకు ముందే కిరణ్ అబ్బవరంతో వరుసగా మూవీస్ ప్రొడ్యూస్ చేయడానికి బడా నిర్మాణ సంస్థలు రెడీ అయిపోయాయి. అవన్నీ ఇప్పుడు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. వరుస పరాజయాలను గ్రహించి కావచ్చు కిరణ్ అబ్బవరం జాగ్రత్త పడటం మొదలెట్టాడు. కొత్త దర్శకులు చెబుతున్న కథలు బాగున్నా, వాటిని తెరకెక్కించడంలో వారు ఫెయిల్ అవుతున్నారని కిరణ్ భావిస్తున్నట్టుగా ఉంది. అందుకే అతి త్వరలో జనం ముందుకు రాబోతున్న తన సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ దర్శకుడిని ఆఖరి నిమిషంలో పక్కకు తప్పించాడు.
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి ‘నేను మీకు కావాల్సిన వాడిని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కార్తీక్ శంకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని అప్పట్లో ప్రకటించారు. సినిమా షూటింగ్ చాలా భాగం అతని పేరుతోనే జరిగింది. అయితే తాజాగా విడుదలైన టీజర్ లో మాత్రం కార్తీక్ శంకర్ ప్లేస్ లోకి ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె వచ్చి చేరాడు. బహుశా మూవీ రషెస్ చూసిన తర్వాత ఆశించినట్టుగా రాకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా కార్తీక్ శంకర్ ను తప్పించి, ప్రాజెక్ట్ ను శ్రీధర్ గాదే చేతిలో పెట్టారేమో తెలియదు. ఆదివారం విడుదలైన టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు నిర్మాత కోడి దివ్య దీప్తి. ఏదేమైనా…. శతాధిక చిత్రాల దర్శకుడి కూతురు నిర్మిస్తున్న తొలి చిత్రం నుండి ఓ నూతన దర్శకుడు తప్పుకోవడం అనేది బాధాకరమే!!.