తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, సినీ కళామతల్లి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటనా చాతుర్యం… అన్నీ కలసిన ఏకైక రూపం ‘ఎన్టీఆర్’. సినిమాల నుంచి రాజకీయాల వరకూ తనదైన ముద్ర వేసి, దశాబ్దాలుగా తెలుగు ప్రజల ప్రేమని పొందుతున్న మహనీయుడు ‘నందమూరి తారకరామారావు’. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు వాడి పౌరుషానికి ప్రతీకగా కనిపించే ఎన్టీఆర్ కీర్తి ఎల్లలు లేనిది. అందుకే ఆయన శత జయంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయనున్నారు. న్యూ జెర్సీలోని మాడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ ప్రముఖ నిర్మాత ‘విశ్వ ప్రసాద్’ ప్రతిపాదించాడు. ‘నార్త్ అమెరికన్ సీమాంధ్రా అసోసియేషన్'(NASAA) తరపున ఈ విగ్రహా బాధ్యతలు తీసుకుంది. విదేశీ గడ్డపై ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఇదే మొదటిసారి. దీంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా నందమూరి అభిమానులు ట్వీట్స్ చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణకి నందమూరి బాలకృష్ణ హాజరయ్యే అవకాశం ఉంది.